
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన గాంధీ శాంతి బహుమతిని 2015, 2016, 2017, 2018 సంవత్సరాలకుగాను రాష్ట్రపతి కోవింద్ గ్రహీతలకు బహూకరించారు. కన్యాకుమారిలోని ‘వివేకానంద కేంద్ర’కు 2015 ఏడాదికిగాను అవార్డు దక్కింది. అక్షయపాత్ర ఫౌండేషన్, సులభ్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా 2016 ఏడాదికిగాను అవార్డును అందుకున్నాయి. ఏకల్ అభియాన్ ట్రస్టుకు 2017 ఏడాదికిగాను బహూకరించారు. కుష్టు వ్యాధి నిర్మూలన కోసం కృషిచేస్తున్న నిప్పన్ ఫౌండేషన్ చైర్మన్, జపాక్‌కు చెందిన యోహియే ససాకవాకు 2018ఏడాదికిగాను బహుమతిని రాష్ట్రపతి కోవింద్ అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సైతం పాల్గొన్నారు.
అందరూ గాంధీ మార్గంలోనే..
‘అమెరికాలోని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నుంచి మొదలుకొని దక్షిణాఫ్రికాలోని నెల్సన్ మండేలా, పోలండ్‌లోని లెక్ వాలేసాదాకా ప్రపంచనేతలంతా మహాత్ముని బోధనలను ఆచరించినవారే’అని కోవింద్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గిరిజన తెగల్లో స్వయం స్వావలంభన, అభివృద్ధి పద్ధతులను పాదుకొల్పిందని ‘వివేకానంద కేంద్ర’నుద్దేశించి కోవింద్ అన్నారు. ఆకలిని పారద్రోలి, కోట్లాది మంది విద్యార్థులకు పోషక విలువలున్న భోజనం అందిస్తూ, అధునాతన బోధనా పద్ధతులను సమకూర్చుతున్న అక్షయ ఫౌండేషన్‌ను కోవింద్ అభినంధించారు. 22 లక్షల మంది చిన్నారులకు విద్యను చేరువచేసిన ఏకల్ అభియాన్ ట్రస్తునూ కోవింద్ స్తుతించారు. ఈ చిన్నారుల్లో 52 శాతం మంది బాలికలే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment