
సాక్షి, బొమ్మనహళ్లి (మంగళూరు): ఎవరికి ఎవరితో ముడిపడి ఉంటుందో, ఎవరితో రుణానుబంధమో ఎవ్వరూ చెప్పలేరు. ప్రతి ఒక్కరికి జోడీ ముందే కుదిర్చే ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. అలాంటిదే ఈ చూడచక్కని జంట కథ. కాఫీ నగరంగా పేరు పొందిన చిక్కమగళూరు జిల్లాలో అరుదైన పెళ్లి జరిగింది. అక్కడికి సమీపంలోని కళసాపురం అనే గ్రామంలో పునీత్ (24), లావణ్య (22) అనే జంట ఆదివారం మూడుముళ్లు, ఏడడుగులతో ఒక్కటైంది. ఇందులో విశేషమేముంది? అనుకోకండి. వీరిద్దరూ మరుగుజ్జులే కాబట్టి ఈ పెళ్లి ప్రత్యేకమే. వధువు, వరుడు ఇద్దరి ఎత్తు కేవలం మూడు అడుగులు మాత్రమే.
ఇలా కుదిరింది
పునీత్‌ది కళసాపురం కాగా, ఆమెది అయ్యనహళ్లి. రెండు మూడేళ్లుగా పునీత్, లావణ్య కన్నవారు వీరికి తగిన జోడీ కోసం గాలిస్తున్నారు. కానీ ఇద్దరికీ సరిపోయేవారు ఎక్కడా దొరకలేదు. ఇంతలో ఒక పెళ్లిలో పునీత్ తల్లిదండ్రులు లావణ్యను చూసి, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. ఇద్దరిదీ ఒకటే ఎత్తు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి నిశ్చయించారు. ఆదివారం ఘనంగా ఈ ప్రత్యేక జంట వివాహోత్సవం జరిగింది. బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. నవ దంపతులు పెళ్లిలో చాలా సంతోషంగా కనిపించారు. ఈడు జోడు సరిగ్గా కుదిరింది అని అతిథులు కొత్త జంటను ఆశీర్వదించారు.





Comments
Please login to add a commentAdd a comment