ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు : కేజీఎఫ్‌లోని బిజిఎంఎల్ బంగారు గనుల ప్రాంతంలో బంగారం కంటే విలువైన పల్లాడియం లోహ నిక్షేపాలు ఉన్నాయి. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వీటి వెలికితీతపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కోలారు జిల్లా ప్రజలకు తీపి కబురు అందిస్తుందని లోక్‌సభ సభ్యుడు ఎస్.మునిస్వామి తెలిపారు. మంగళవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిజిఎంఎల్ పునరుజ్జీవనానికి సంబంధించి గని కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకు వెళ్లి విజ్ఞప్తి చేశామన్నారు. ఆ సమయంలో ప్రధాని సూచనల మేరకు కేంద్ర గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్‌జోషి నేతృత్వంలో ఒక సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి బిజిఎంఎల్‌ను సందర్శించి బంగారు నిక్షేపాల నమూనాలను ల్యాబొరేటరికి పంపిన సమయంలో బంగారం కంటే విలువైన పల్లాడియం లోహ నిక్షేపాలు ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) తరహాలో ఈ గనులను పునః ప్రారంభించే
అవకాశం ఉంది. దీనిపై వచ్చే పార్లమెంట్ సమావేశాలలో తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చు అని తెలిపారు.
2022లో రైల్వే వర్క్‌షాప్
బిజిఎంఎల్‌కు చెందిన 12600 ఎకరాల ప్రాంతాన్ని ఎస్‌ఇజెడ్‌గా ప్రకటించడానికి 1000 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సోలార్ ఉపకరణాల తయారీకి ఇప్పటికే సర్వే ప్రారంభించిందని ఎంపీ తెలిపారు. శ్రీనివాసపురంలో రూ.485 కోట్ల వ్యయంతో రైల్వే వర్క్‌షాపును 2022 లోగా ప్రారంభమవుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన భూమిని రైల్వే అధికారులకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతానికి కృష్ణా నది నీటిని అందించే పథకానికి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. వచ్చే నాలుగు సంవత్సరాలలోగా దీనిని పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా ఇంచార్జి మంత్రి నాగేష్, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి రవి కుమార్, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు బి పి వెంకటమునియప్ప తదితరులు పాల్గొన్నారు.
పల్లాడియం అంటే
ప్లాటినం గ్రూపు లోహాలకు చెందిన ఇది వెండి రంగులో ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతకే కరుగుతుంది. ప్రపంచంలో చాలా అరుదుగా లభిస్తున్నందున అరుదైన లోహంగా గుర్తింపు పొందింది. కార్ల ఇంజిన్ విడిభాగాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో అధికంగా ఉత్పత్తి అవుతున్నా ప్రపంచ డిమాండుకు సరిపోవడం లేదు. దీని గ్రాము ధర బంగారం, ప్లాటినంల కంటే ఎక్కువే.
Comments
Please login to add a commentAdd a comment