న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ విజృంభిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 మరణాలు సంభవించగా.. 900 లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో వ్యాపార దిగ్గజం టాటా ట్రస్ట్ కరోనా పోరుకై రూ.500 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. ఈమేరకు టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా ట్విటర్‌లో ప్రకటన విడుదల చేశారు. ‘యావత్ ప్రపంచం, భారత్ కోవిడ్-19 తో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. దీన్నుంచి బయటపడాలంటే సత్వర చర్యలు అవసరం. ప్రతీ గంటా ఎంతో విలువైనది. జాతి మొత్తం ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. మన ముందున్న కష్టతరమైన సవాలు ఇది. టాటా ట్రస్ట్ జాతి రక్షణకు ప్రతిజ్ఞ చేస్తోంది. వైరస్ పోరులో అనునిత్యం శ్రమిస్తున్న వారికి, బాధితులకు సాయం కోసం రూ.500 కోట్లు కేటాయించాలని నిర్ణయించాం’ అని రతన్ టాటా పేర్కొన్నారు.
(చదవండి: నిత్యావసరాలకు మాత్రమే ఓకే..)
వైరస్ బాధితులకు సేవలందించే వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామాగ్రి, బాధితులకు వైద్య పరికరాలు, వైరస్ పరీక్షలకు టెస్టింగ్ కిట్లు, ప్రజలకు వైరస్‌పై అవగాహన కార్యక్రమాలకు ఈ మొత్తం ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టాటా ట్రస్ట్, టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా కలిసి పనిచేస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి మహమ్మారితో పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ బారినపడి 28 వేల మంది ప్రాణాలు కోల్పోగా.. 6 లక్షలకు పైగా బాధితులుగా మారారు.
(చదవండి: అక్కడ లాక్‌డౌన్ మరో 6 నెలలు!)
Comments
Please login to add a commentAdd a comment