న్యూఢిల్లీ : మొత్తానికి ఊహించినట్టుగానే చార్జీల బాదుడు లేకుండానే రైల్వేబడ్జెట్ ముగిసింది. రైల్వేల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంది... నిధులు వస్తే సేవలు మెరుగుపడతాయంటూ సాగిన రైల్వేమంత్రి సురేశ్ ప్రభు ప్రసంగంలో పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత, మహిళలకు అదనపు భద్రత, వికలాంగులకు, పురుషులకు అదనపు సౌకర్యాలు, వై- ఫై, వినోదం, కొత్త హెల్ప్ లైన్, రైళ్ల వేగం పెంపులాంటి మెరుపులు కనిపించాయి. అయితే సరుకు రవాణా చార్జీలు భారీగా పెరగనున్నాయని సమాచారం.
రైల్వేబడ్జెట్పై దేశవ్యాప్తంగా పొగడ్తలు.. విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి.
సమాజ్వాదీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ రైల్వేబడ్జెట్ హంగులూ, ఆర్భాటాలు లేకుండా ఉందని అభినందించారు. గత బడ్జెట్లలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని కోరారు. కొత్త ప్రాజెక్టులను ప్రకటించడం కాకుండా, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని హామీ ఇచ్చి మంచి పని చేశారన్నారు.
బీజేపీ సోదరసంస్థ శివసేన రైల్వే బడ్జెట్పై పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేసింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడానికి నిధులు ఎలా సేకరిస్తారని ప్రశ్నించింది. అంతా మాయ తప్ప ఏమీ లేదని శివసేన సీనియర్ నాయకుడు, ఎంపీ గజానన్ కీర్తికార్ విమర్శించారు.
విభజన నేపథ్యంలో తమ రాష్ట్రాలకు ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆశించాయి తెలుగు రాష్ట్రాలు. కానీ అంతులేని నిరాశే మిగిలింది. దీనిపై నిరసన వెల్లువెత్తుతోంది.
ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ సీపీఐ ఆధ్వర్యంలో నిజామాబాద్లో ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న రైల్వేజోన్, రైల్వేలైన్ల ప్రస్తావన లేదని నేతలు మండిపడ్డారు.
ఇది సామాన్యప్రజలకు అనుకూలమైందంటూ రైల్వే బడ్జెట్ ను స్వాగతిస్తూనే కొత్త రైళ్లు, కొత్త లైన్లు కేటాయించకపోవడంపై ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖకు రైల్వేజోన్ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
బడ్జెట్ ప్రకంపనలు
Published Thu, Feb 26 2015 4:05 PM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement
Advertisement