‘రియల్’ బిల్లుకు చిక్కులు
నేడు రాజ్యసభ ముందుకు బిల్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
న్యూఢిల్లీ: స్థిరాస్తి వ్యాపారాన్ని నియంత్రించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రియల్ ఎస్టేట్ బిల్లుకు రాజ్యసభలో చిక్కులు ఎదురుకానున్నాయి. మంగళవారం పెద్దల సభలో చర్చకు రానున్న ఈ బిల్లుపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తన వ్యతిరేకతను ఉధృతం చేసింది. వాస్తవానికి గత బుధవారమే ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదం కోసం ప్రవేశపెట్టాలని మోదీ సర్కారు తలచినప్పటికీ.. బిల్లును పార్లమెంటు ఎంపిక కమిటీకి నివేదించాలని కాంగ్రెస్ పట్టుపట్టడంతో.. ఎగువ సభలో సంఖ్యా బలం తక్కువగా ఉన్న సర్కారు బిల్లును వాయిదా వేసుకుంది.
ప్రతిపక్షం ఎదురుదాడి చేయటంతో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు.. పార్టీలతో మరిన్ని సంప్రదింపులు జరపటానికి బిల్లును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచీ బిల్లుపై కాంగ్రెస్ వైఖరి మరింత కఠినంగా మారింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గత శనివారం నాడు జాతీయ రాజధాని ప్రాంతానికి (ఎన్‌సీఆర్) చెందిన ఇళ్ల కొనుగోలుదారులను కలిసిన తర్వాత.. ప్రభుత్వం మధ్యతరగతి ఇళ్ల కొనుగోలుదారులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, బిల్లును బిల్డర్లకు అనుకూలంగా మార్చి తెస్తోందని ధ్వజమెత్తారు.
ఫ్లాట్ యజమానుల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని వారి ప్రతినిధులకు రాహుల్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో యూపీఏ హయాంలో తెచ్చిన రియల్ ఎస్టేట్ బిల్లుకు, ఎన్‌డీఏ తెచ్చిన ప్రస్తుత బిల్లుకు తేడాలను విడమరచి చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక ప్రభుత్వం బిల్లును ఆమోదింపచేసుకునేందుకు పలు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. స్థిరాస్తి రంగాన్ని నియంత్రించేందుకు, ప్రోత్సహించేందుకు, వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు ఈ బిల్లును తెస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది.
జీఎస్‌టీ బిల్లుకు తృణమూల్ మద్దతు
వస్తువులు, సేవల పన్నుల (జీఎస్‌టీ) బిల్లుకు తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. కీలక ఆర్థిక సంస్కరణ లక్ష్యంగా తెస్తున్న ఈ బిల్లు మంగళవారం లోక్‌సభ ముందుకు రానుంది. గత నెల 26న బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. దానిని పార్లమెంటు స్థాయీ సంఘానికి నివేదించాలని కాంగ్రెస్, బీజేడీ, వామపక్షాలు సహా పలు ప్రతిపక్ష పార్టీలు గట్టిగా పట్టుపట్టాయి.
ఈ పరిస్థితుల్లో.. తృణమూల్ కాంగ్రెస్ బిల్లుకు మద్దతు తెలపటం కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఊరటనిచ్చినట్లయింది. ‘‘స్థాయీ సంఘం, ఎంపిక కమిటీలు ఈ బిల్లుపై ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చాయి. కాబట్టి, దీనిని మళ్లీ స్థాయీ సంఘానికి తిప్పిపంపటంలో అర్థం లేదు’’ అని తృణమూల్ నేత డెరెక్ ఒ-బ్రీన్ సోమవారం పీటీఐ వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు. జీఎస్‌టీ అమలు వల్ల రాష్ట్రాలు నష్టపోయే మొత్తాన్ని చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.