నల్ల కుబేరుల నుంచే సమాచారం సేకరిస్తున్న అధికారులు
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచిన భారతీయుల నుంచి సమాచారం రాబట్టడంలో దర్యాప్తు అధికారులు కొత్త పంథాలో వెళ్తున్నారు. అధికారిక, అనధికారిక మార్గాల ద్వారా తమకందిన నల్ల కుబేరుల జాబితాలో నుంచి 100 మందిని గుర్తించి.. తమ అకౌంట్ల సమాచారం ఇవ్వాల్సిందిగా వారినే అడిగారు. సమాచారం ఇస్తే.. వారిని కఠిన శిక్షలు విధించే చట్టాల ప్రకారం కాకుండా, కఠినం కాని పన్ను ఎగవేత చట్టాల పరిధిలో విచారిస్తామని హామీ ఇచ్చారు. దాంతో హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చండీగఢ్‌లకు చెందిన ఆ అకౌంట్ హోల్డర్లు ఐటీ, ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు, కేంద్ర ఆర్థిక శాఖలకు చెందిన దర్యాప్తు అధికారులకు వారడిగిన సమాచారమిచ్చారు.
స్థానిక చట్టాలను కారణంగా చూపి భారత్‌కు సమాచారం ఇచ్చేందుకు స్విట్జర్లాండ్ నిరాకరించడంతో.. ఈ పంథాలో ముందుకు వెళ్తున్నారు. ఇలా రూ. 50 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు పన్నుగా వచ్చే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఈ సమాచారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సుప్రీంకోర్టుకు అందించిందన్నాయి. ఆ నల్లధనానికి సంబంధించిన ఆదాయ వనరులపై ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారభించారని, తద్వారా పన్ను ఎగవేతకు సంబంధించిన కొత్త విషయాలు బయటపడే అవకాశముందన్నాయి. హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ ఉద్యోగి ద్వారా ఫ్రాన్స్‌కు, అక్కడి నుంచి భారత్‌కు ‘హెచ్‌ఎస్‌బీసీ జాబితా’లోని భారతీయ నల్ల కుబేరుల వివరాలు చే రాయి.
నల్లధనం రికవరీకి నయా పంథా!
Published Mon, Aug 25 2014 2:19 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
Advertisement
Advertisement