ఇకపై పోలీసుల అనుమతి తప్పనిరి
సాక్షి, ముంబై: నగరంతోపాటు, నవీముంబై పరిసరాల్లోని మసీదుల మినార్‌లపై లౌడ్ స్పీకర్లు ఏర్పాటుచేసే ముందు పోలీసుల అనుమతి తీసుకున్నారా ...? లేదా..? అనేది పరిశీలించాలని బాంబే హైకోర్టు ముంబై, నవీముంబై పోలీసులను ఆదేశించింది. ఒకవేళ అనుమతి తీసుకోని పక్షంలో ఆ లౌడ్‌స్పీకర్లను జప్తు చేయాలని ఆదేశించింది. లౌడ్‌స్పీకర్ల వినియోగంపై సంతోష్ పాచ్‌లగ్ అనే సామాజిన కార్యకర్త కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు విద్యాసాగర్ కానడే, ప్రమోద్ కోదే ల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. నవీముంబై పరిసరాల్లో 45 మసీదుల్లో ఏర్పాటుచేసిన లౌడ్‌స్పీకర్లకు స్థానిక పోలీసుల అనుమతి తీసుకోలేదని సమాచార హక్కు ద్వారా సేకరించారు.
దీంతో ఆయన కోర్టులో పిల్ దాఖలు చేశారు. పంద్రాగస్టు లేదా జనవరి 26తో పాటు వివిధ మతాల పండుగల్లో అక్రమంగా లౌడ్‌స్పీకర్లను వినియోగిస్తుంటారు. ఇలాంటి వాటిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు పిల్‌లో పేర్కొన్నాడు. కాగా నవరాత్రి ఉత్సవాల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఉంటుంది. వీటి కారణంగా వృద్ధులు ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు పడతారని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ముంబై, నవిముంబై పరిసరాల్లో మసీదుల్లో ఏర్పాటుచేసిన లౌడ్‌స్పీకర్లకు అనుమతి తీసుకోని పక్షంలో వాటిని జప్తు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ధ్వని కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని కోర్టు అభిప్రాయపడింది.
మసీదుల్లో లౌడ్‌స్పీకర్లపై ఆంక్షలు
Published Thu, Jul 31 2014 11:39 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement