ఢిల్లీ ఫలితాలు నేడే
- ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. పటిష్ట భద్రత నడుమ ఢిల్లీలోని 14 కేంద్రాల్లో లెక్కింపు నేటి(మంగళవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 70 స్థానాల తుది ఫలితాలు విడుదల చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ జరిగిన శనివారం నాటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు స్పష్టమైన మెజారిటీని అంచనావేయగా.. వాటిని తోసిపుచ్చిన బీజేపీ 38 స్థానాల్లో గెలుస్తామని పేర్కొంది.
ఫలితాలపై ఆందోళన లేదు.. ఫలితాల గురించి ఉత్కంఠ కానీ, ఆందోళన కానీ లేదని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ సోమవారం అన్నారు. గత 17 రోజులుగా సాధ్యమైనంత వరకు కృషి చేశానని, తన చేతుల్లో లేని ఫలితాల గురించి ఆదుర్దా పడబోనని కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేశారు.
మోదీ రాజీనామా చేయాలి.. ఢిల్లీ ఎన్నికలను మోదీ పాలనకు రిఫరెండంగా పేర్కొంటున్నందున.. ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తే ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ ఓటమి పాలైతే.. రాహుల్‌గాంధీ బాధ్యత తీసుకుంటారా? అన్న ప్రశ్నకు.. పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్‌మాకెన్ నేతృత్వంలో కాంగ్రెస్ పోటీచేసిందని ఆ పార్టీ ప్రతినిధి అజయ్ కుమార్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ఓడిపోతే రాజీనామా చేస్తానని మాకెన్ ఇప్పటికే ప్రకటించారన్నారు. కాగా, సదర్‌బజార్ స్థానం నుంచి పోటీ చేసిన అజయ్ మాకెన్ ఆ స్థానంలో ఓడిపోనున్నారన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో.. అదే జరిగితే పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేస్తానని మాకెన్ తన సన్నిహితులతో స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు, కాంగ్రెస్ 3, 4 స్థానాలను మించి గెలుచుకోబోదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే.. అది పార్టీకి వినాశకరమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.