న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సిరంజీలు, సూదులు వంటి వైద్య పరికరాలను వేయి శాతానికి పైగా లాభంతో విక్రయిస్తున్నారు. పంపిణీదారుడి మార్జిన్లు మినహాయిస్తే అంతిమంగా భారం మోస్తున్నది వినియోగదారుడే. తయారీదారులు, ఎగుమతిదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి, సిరంజీలు, సూదుల లాభాల మార్జిన్లపై జాతీయ ఔషధ ధరల నిర్ధారణ సంస్థ(ఎన్‌పీపీఏ) ఈ విషయాలను వెలుగులోకి తెచ్చింది. సూదితో కూడిన 5 ఎంఎల్ హైపోడెర్మిక్ డిస్పోజబుల్ సిరంజీ తయారీ ధర రూ. 2.31. కానీ పంపిణీదారుడికి చేరే సరికి దాని ధర రూ. 13.08 (1251శాతం అధికం) అవుతోంది.
సూదిలేని 50 ఎంఎల్ హైపోడెర్మిక్ డిస్పోజిబుల్ సిరంజీ ధర పంపిణీదారుడి వద్దకు వచ్చే సరికి రూ.16.96 కాగా, వినియోగదారుడికి అమ్మే గరిష్ట చిల్లర ధర రూ.97గా(సుమారు 1249 శాతం లాభం) ఉంటోంది. సూదితో కలపి 1 ఎంఎల్ ఇన్సులిన్ సిరంజీని తయారీ ధరకంటే 400 శాతం అధిక ధరకు అమ్ముతున్నారు. అలాగే సూది లేని 1 ఎంఎల్ ఇన్సులిన్ సిరంజీని తయారీ ధర కన్నా 287 శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారు. డిస్పోజబుల్ సూదిపై గరిష్ట మార్జిన్ 789 శాతంగా ఉంది. సూదుల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు రాజీవ్‌నాథ్ స్పందిస్తూ.. ‘అధిక మార్జిన్లు నిజమే. ఆయా కంపెనీల మధ్య అనారోగ్య పోటీయే దీనికి కారణం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment