National Pharmaceutical Pricing Authority
-
అత్యవసర ఔషధాల జాబితాలో కరోనరీ స్టెంట్లు
న్యూఢిల్లీ: కరోనరీ స్టెంట్లను అత్యవసర ఔషధాల జాతీయ జాబితా(ఎన్ఎల్ఈఎం–2022)లో చేరుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మెటల్ సెంట్లు(బీఎంఎస్), మందు పూత పూసిన స్టెంట్లు(డీఈఎస్)ను ఈ జాబితాలో చేర్చారు. ఇన్నాళ్లూ ‘పరికరాల’ జాబితాలో ఉన్న స్టెంట్లను ఔషధాలుగా అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చడం వల్ల ఎంబీఎస్, డీఈఎస్‌తోపాటు బీవీఎస్, బయోడిగ్రేడబుల్ సెంట్ల ధరలు తగ్గనున్నాయి. ధరలపై నేషనల్ ఫార్మాస్యూటికల్, ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) తుది నిర్ణయం తీసుకోనుంది. దేశంలో కరోనరీ ఆర్టరీ వ్యాధులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో స్టెంట్ల ధరల తగ్గుదల వల్ల బాధితులకు ఎంతో ఉపశమనం కలుగనుంది. అత్యవసర ఔషధాల జాతీయ జాబితాలో 2015లో 376 ఔషధాలు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 384కు చేరింది. ఎన్ఎల్ఈఎంలో ఉన్న మందులను ఎన్పీపీఏ నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి వీల్లేదు. -
పేదలపై మరో గుదిబండ.. గోలి.. జేబు ఖాళీ!
సామాన్యులు, మధ్య తరగతి వారిపై మరో పిడుగు పడనుంది. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న వారు.. ఇకపై జ్వరం గోలికి సైతం అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వివిధ రకాల కారణాలతో ఔషధ కంపెనీలు 10.7 శాతం మేర ధరలు పెంచుకునేందుకు ఎన్పీపీఏ అనుమతిచ్చింది. గత నెల నుంచే కొన్నిరకాల మందుల ధరలు పెరగగా.. తాజాగా మిగతా వాటి పెంపునకు చర్యలు చేపడుతున్నారు. ఫలితంగా మందు గోలీల రూపంలో పేదలపై మరో గుదిబండ పడనుంది. అయిజ రూరల్ (జోగులాంబ గద్వాల): నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) తీసుకుంటున్న నిర్ణయంతో ఔషధ మందులు కొనుగోలు చేసేవారి జేబులు ఖాళీ కానున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే మార్కెట్లో ఉన్న మందుల ధరలకు అదనంగా మరో 10.7 శాతం పెరగనున్నాయి. గత నెలలోనే ఆయా కంపెనీలకు ధరలను పెంచుకునే అవకాశం కల్పించడం వల్ల ఇప్పటికే మార్కెట్లో లభించే కొన్ని మందుల ధరలు పెరిగాయి. ఎన్పీపీఏ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మార్కెట్లో లభించే మందుల్లో దాదాపు 800 రకాల ధరలు పెగనున్నాయి. జ్వరం, గుండె వ్యాధులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, అనీమియా వంటి వ్యాధులకు మందులు కొనాలంటే ఇక నుంచి కొనుగోలు దారుడికి భారంగా మారనుంది. సాధారణంగా వాడే మందుల్లో పారాషిటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లో క్యాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనీడజోల్ లాంటి మందులు పెరుగుతున్న వాటి జాబితాలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. సామాన్యులపైనే.. ఫార్మాసూటికల్ కంపెనీలు పెంచుతున్న ధరలు సామాన్యుడికి గుదిబండగా మారనున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో వివిధ రకాల వ్యాధుల బారిన పడినవారు కాకుండా, ప్రధానంగా బీపీ, షుగర్ వ్యాధులు ఉన్న వారు రూ.6 వేలకు పైచిలుకు ఉంటారని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో కూడా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే అధికంగా ఉంటారని చెబుతున్నారు. ఈ రెండు వ్యాధుల బారిన పడిన వారిలో దాదాపు 15 శాతం మంది మాత్రమే ప్రభుత్వం ద్వారా అందే మందులను వాడుతుండగా, మిగిలిన 85 శాతం వ్యాధిగ్రస్తులు ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుగోలు చేసి వాడుతున్నారు. ప్రైవేటు దుకాణాల్లో మందులు వాడుతున్న వారికి నెలకు రూ.2,500 వరకు ఖర్చు అవుతుంది. ఈ రూపేణా చూసుకున్న ఇప్పుడు పెరిగిన మందుల ధరల ప్రకారం వారికి ఏడాదికి రూ.3,210 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అసలే పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరోవైపు పెరిగిన మందుల ధరలు గుదిబండగా మారనున్నాయి. పెరుగుదల ఎందుకు..? కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ గణాంకాల ఆధారంగా 2020 సంవత్సరంతో పోలిస్తే 2021కి గాను మందుల టోకు ధరల సూచి ఇప్పటికే 10.7 శాతానికి పెరిగినట్లు ఎన్పీపీఏ ప్రకటించింది. ఈ నిర్ణయం మేరకు 2019లో మాత్రం ఔషధ కంపెనీలు మందుల ధరలను 2 శాతానికి పెంచుకోగా, అదే 2020 సంవత్సరంలో మాత్రం 0.5 శాతమే పెంచుకునే అవకాశం ఔషధ కంపెనీలకు కల్పించింది. కోవిడ్ అనంతరం మాత్రం మందుల తయారీ కోసం ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడం, ప్యాకింగ్, రవాణా ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఔషధ కంపెనీలకు ధరలు పెంచక తప్పడం లేదనే వాదనలు ఉన్నాయి. పేదలు ఎలా కొనాలి.. మందులు ధరలు ఇలా పెరిగితే సామాన్యులు ఎలా కొనాలి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరిగి పేదవాడు అనేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు మందుల ధరలు పెరిగితే అదే పేదవాడు ఎలా కొని వ్యాధిని నయం చేసుకోవాలి. జ్వరం గోలి కూడా ధర పెరుగుతుంది అంటున్నారు. ఇలా అయితే చాలా కష్టం. – ఆంజనేయులుగౌడ్, గట్టు దశల వారీగా పెంపు.. మందుల తయారికి ఉపయోగించే ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల ఔషధ మందుల ధరలు కూడా పెరగనున్నాయి. ఇప్పటికే కొన్ని మందుల ధరలు నిబంధనల మేరకు పెరిగాయి. ఇంకా మరికొన్ని ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే దశల వారీగా పెరుగుతాయి. – శ్రీకాంత్, డ్రగ్ ఇన్స్పెక్టర్, గద్వాల -
జ్వరం గోలీకి ధరల సెగ!
సాక్షి, హైదరాబాద్: నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే విలవిల్లాడుతున్న సగటు జీవిపై మందుల భారం కూడా పడనుంది. జ్వరం బిళ్ల మొదలు బీపీ గోలీ వరకు సామాన్యులు ఎక్కువగా వినియోగించే దాదాపు 800 రకాల షెడ్యూల్డ్ మందులపై కేంద్రం ధరాభారం మోపింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆయా మందుల ధరలను 10.76 శాతం మేర పెంచుకొనేందుకు అనుమతిచ్చింది. 2020తో పోలిస్తే 2021 క్యాలెండర్ సంవత్సరానికి టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)లో 10.7 శాతం మేర వచ్చిన మార్పునకు అనుగుణంగా ధరలను సవరించుకొనేందుకు సంబంధిత వర్గాలకు అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) మెమొరాండం విడుదల చేసింది. ఎక్కువ మంది వినియోగించేవే పెరుగుతాయి... జ్వరం, ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, అనీమియా వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలన్నీ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెరుగుతాయి. ఇవిగాకుండా అత్యధికంగా వినియోగంలో ఉండే పారాసిటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడజోల్ వంటి ఔషధాల ధరలు కూడా పెరుగుతాయి. బలం కోసం వినియోగించే మల్టీ విటమిన్ల మందుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి నుంచే వేగంగా పెరుగుదల... దేశంలో ఔషదాల ధరల పెరుగుదల రెండేళ్లుగా కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి లాక్డౌన్, అనంతర పరిస్థితులకు అనుగుణంగా పలు రకాల మందుల ధరలు 20 శాతం దాకా పెరిగాయి. -
సిరంజీపై 1000% లాభం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సిరంజీలు, సూదులు వంటి వైద్య పరికరాలను వేయి శాతానికి పైగా లాభంతో విక్రయిస్తున్నారు. పంపిణీదారుడి మార్జిన్లు మినహాయిస్తే అంతిమంగా భారం మోస్తున్నది వినియోగదారుడే. తయారీదారులు, ఎగుమతిదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి, సిరంజీలు, సూదుల లాభాల మార్జిన్లపై జాతీయ ఔషధ ధరల నిర్ధారణ సంస్థ(ఎన్పీపీఏ) ఈ విషయాలను వెలుగులోకి తెచ్చింది. సూదితో కూడిన 5 ఎంఎల్ హైపోడెర్మిక్ డిస్పోజబుల్ సిరంజీ తయారీ ధర రూ. 2.31. కానీ పంపిణీదారుడికి చేరే సరికి దాని ధర రూ. 13.08 (1251శాతం అధికం) అవుతోంది. సూదిలేని 50 ఎంఎల్ హైపోడెర్మిక్ డిస్పోజిబుల్ సిరంజీ ధర పంపిణీదారుడి వద్దకు వచ్చే సరికి రూ.16.96 కాగా, వినియోగదారుడికి అమ్మే గరిష్ట చిల్లర ధర రూ.97గా(సుమారు 1249 శాతం లాభం) ఉంటోంది. సూదితో కలపి 1 ఎంఎల్ ఇన్సులిన్ సిరంజీని తయారీ ధరకంటే 400 శాతం అధిక ధరకు అమ్ముతున్నారు. అలాగే సూది లేని 1 ఎంఎల్ ఇన్సులిన్ సిరంజీని తయారీ ధర కన్నా 287 శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారు. డిస్పోజబుల్ సూదిపై గరిష్ట మార్జిన్ 789 శాతంగా ఉంది. సూదుల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు రాజీవ్‌నాథ్ స్పందిస్తూ.. ‘అధిక మార్జిన్లు నిజమే. ఆయా కంపెనీల మధ్య అనారోగ్య పోటీయే దీనికి కారణం’ అని అన్నారు. -
2 శాతం పెరిగిన స్టెంట్ల ధరలు
న్యూఢిల్లీ: ఔషధ ధరల నిర్ణాయక సంస్థ (ఎన్పీపీఏ) స్టెంట్ల ధరలను 2 శాతం పెంచింది. టోకు ధరల సూచీ ఆధారంగా తీసుకున్న ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి రానుంది. తాజా మార్పులతో బేర్ మెటల్ స్టెంట్ల ధరలు రూ.7260 నుంచి రూ.7400కు పెరిగాయి. అలాగే ఎల్యూటింగ్ స్టెంట్ల ధరలు రూ.29600 నుంచి రూ. 30,180కి చేరుకున్నాయి. హెపటిటిస్, హెచ్ఐవీ, టీబీలకు లాంటి వ్యాధులకు వాడే 46 డ్రగ్ ఫార్ములేషన్ల గరిష్ట ధరలను కూడా ఎన్పీపీఏ నిర్ణయించింది. ఫిబ్రవరిలో ఎన్పీపీఏ స్టెంట్లను ధరల నియంత్రణ జాబితాలోకి తెచ్చి బేర్ మెటల్ స్టెంట్ల ధరలను రూ.7260గా, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ల ధరలను రూ.29600గా నిర్ధారించింది. అంతకు ముందు వాటి సరాసరి గరిష్ట ధరలు వరుసగా రూ.45,100, రూ.1.21 లక్షలుగా ఉన్నాయి. -
కంటి లెన్స్ ధరలు తగ్గుతాయ్!
ధరలకు కళ్లెం వేయనున్న ఎన్పీపీఏ సాక్షి, అమరావతి: స్టెంట్ల ధరలను అదుపు లోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) మరో కీలక అడుగు వెయ్య బోతోంది. కంటి లెన్స్‌లు, కృత్రిమ మోకాలి చిప్పల ధరలపై కూడా నియంత్రణ విధించ నున్నట్లు ఫార్మాస్యూటికల్ వర్గాలు తెలిపా యి. వీటితోపాటు వెన్నుపూసకు వేసే స్క్రూలు, రాడ్లు, తుంటి∙ఎముకలో వేసే స్క్రూలు, మోకాలి కింద ఎముకలకు వేసే స్క్రూలు, రాడ్ల ధరలకు కళ్లెం వేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మోకాలి చిప్పల మార్పిడి ఖరీదైన వ్యవహారంగా మారిపో యింది. ఒక్క మోకాలి చిప్పను మార్చాలంటే రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. మోకాలి చిప్ప మార్పిడి అనేది సామాన్యులకు అందని ద్రాక్షగా మారింది. స్టెంట్ల ధరలు తగ్గినా బాదుడేనా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కంటికి లెన్స్‌లు వేయించుకుంటున్న వారిసంఖ్య ప్రతిఏటా లక్షల్లోనే ఉంటోంది. ఒక కంటికి లెన్స్ వేయించుకుంటే రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ వసూలు చేస్తున్నారు. విదేశీ లెన్స్‌లని, దిగుమతి చేసుకున్నవని, బ్రాండెడ్ లెన్స్‌లని.. ఇలా రకరకాల కారణాలతో రోగుల జేబులను గుల్ల చేస్తున్నారు. రూ.2 లక్షల దాకా ఉన్న స్టెంట్ ధరను రూ.30 వేలకు నియంత్రించినట్టే, కంటి లెన్స్‌ల ధర కూడా రూ.4 వేల నుంచి రూ.5 వేల లోపు ఉండేలా చర్యలు తీసుకోవా లని భావిస్తున్నట్టు ఫార్మాస్యూటికల్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్పీపీఏ త్వరలో సమావేశమై, ధరల తగ్గింపుపై తుది నిర్ణయం తీసుకోనుంది. డ్రగ్ ఎల్యూటెడ్ స్టెంట్లను కూడా ఒక్కొక్కటి రూ.30 వేలకు మించి అమ్మకూడదని ఎన్పీపీఏ స్పష్టం చేసింది. అయినా సరే కార్పొరేట్ ఆస్పత్రులు రూ.2 లక్షల దాకా చార్జి చేస్తున్నాయి. ఈ దోపిడీని ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని రోగులు కోరుతున్నారు. కచ్చితమైన నియంత్రణ వ్యవస్థ ఉండాలి ‘‘స్టెంట్ల ధరలను తగ్గించినా కార్పొరేట్ హాస్పిటళ్లు పాత ధరలనే వసూలు చేస్తుండడంతో రోగులు నష్టపో తున్నారు. ఆస్పత్రులు వసూలు చేస్తున్న ధరలకు అడ్డుకట్ట వేయాలి. ఇందుకోసం కచ్చితమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. లేకుంటే స్టెంట్లు, లెన్స్‌లు, స్క్రూలు, రాడ్ల ధరలను తగ్గించినా రోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ – డా.సాంబశివారెడ్డి,న్యూరోసర్జన్, సిటీ న్యూరో సెంటర్ -
ఎన్పీపీఏ అధికారాలకు కత్తెర
న్యూఢిల్లీ: జాతీయ ఔషధ ధరల నిర్ణాయక సంస్థ(ఎన్పీపీఏ) అధికారాల్లో కేంద్రం కోత విధించింది. అత్యావసరంకాని ఔషధాల(నాన్-అసెన్షియల్) ధరలపై పరిమితి విధింపునకు సంబంధించి డ్రగ్ప్రైస్ కంట్రోల్ ఆర్డర్(డీపీసీఓ)-2013లోని నిబంధనలను కొన్నింటిని ఉపసంహరించుకుంది. ఎరువులు, రసాయనాల శాఖ అధీనంలో పనిచేస్తున్న ఫార్మాసూటికల్స్ విభాగం గత శుక్రవారం ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఎన్‌పీపీఓ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల 43 ఔషధాల ధరలపై పరిమితి విధింపుపై ఫార్మా కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. డీపీసీఓ 2013లోని 19వ పేరాగ్రాఫ్ ప్రకారం హెచ్ఐవీ, గుండెసంబంధ వ్యాధుల చికిత్సలో ఉపయోగించే కొన్ని నాన్-అసెన్షియల్ డ్రగ్స్‌పై పరిమితి విధించేందుకు ఈ ఏడాది మే 29న తాము మర్గదర్శకాలను ఇచ్చామని... దీన్ని తక్షణం ఉపసంహరించుకుంటున్నట్లు సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ఎన్పీపీఏ వెల్లడించింది. అయితే, ఈ ఏడాది జూలై 10న 108 నాన్-అసెన్షియల్ ఔషధాల ధరలపై పరిమితికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలను ఇందులో ప్రస్తావించలేదు. ఫార్మా కంపెనీలకు సానుకూలం... ప్రభుత్వ ఆదేశాలమేరకు ఇకపై డీపీసీఓ ప్రకారం తమకు నాన్-అసెన్షియల్ ఔషధాల ధరలను నియంత్రించే(పరిమితి విధింపు) అధికారం పోయినట్లేనని ఎన్పీపీఏ అధికారి ఒకరు వివరించారు. ప్రాణాధార ఔషధాల జాబితా(ఎన్ఎల్ఈఎం)లో లేని కొన్ని డ్రగ్స్ ధరలను ప్రజా ప్రయోజనాలరీత్యా అసాధారణ పరిస్థితుల్లో నియంత్రించేందుకు డీపీసీఓ-2013లోని పేరాగ్రాఫ్ 19 ఎన్‌పీపీఏకి వీలు కల్పిస్తోంది. దీనిప్రకారమే కొన్ని ఔషధాల ధరలపై పరిమితులను ఇటీవలి కాలంలో ఎన్పీపీఏ విధించింది. డీపీసీఓ-2013 ప్రకారం ఎన్ఎల్ఈఎం జాబితాలో ఉన్న 348 డ్రగ్స్ ధరలను ఇప్పటికే కేంద్రం నియంత్రిస్తోంది. -
ధరల నియంత్రణే ఫార్మాకు అడ్డంకి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలో పరిమాణం పరంగా మూడవ స్థానం. మొత్తం ఉత్పత్తిలో 10 శాతం. 210పైగా దేశాలకు ఎగుమతులు. ఇదీ ఔషధ తయారీలో భారత ప్రస్థానం. ఇంత ప్రత్యేకత ఉన్నప్పటికీ పరిశ్రమ మాత్రం అసంతృప్తిగా ఉంది. ఔషధ ధరల నియంత్రణ పరిశ్రమ వృద్ధికి ఆటంకంగా ఉందని ఇండియన్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(ఐడీఎంఏ) అంటోంది. ధరల నియంత్రణ పరిధిలోకి తెస్తున్న ఔషధాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని... ఎక్కడో దగ్గర అడ్డుకట్ట పడకపోతే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమని పేర్కొంది. జాబితాలోకి మరిన్ని.. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) ఇటీవలే ఆవశ్యక ఔషధాల జాబితాలోకి మధుమేహం, హృదయ సంబంధించి 50 ఔషధాలను చేర్చింది. ఇప్పటికే ఈ జాబితాలో పలు చికిత్సలకు సంబంధించిన 316 ఔషధాలు ఉన్నాయి. నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్‌ను జాబితాలోకి తీసుకురావడం డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డరు(డీపీసీవో)-2013కు విరుద్ధమని ఐడీఎంఏ అంటోంది. ఆవశ్యక ఔషధాల చిట్టా పెరుగుతూ పోతుంటే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమని ఐడీఎంఏ ప్రెసిడెంట్, ఫోర్ట్స్ ఇండియా ల్యాబొరేటరీస్ సీఎండీ ఎస్వీ వీరమణి సాక్షి బిజినెస్ బ్యూరోతో అన్నారు. ఆవశ్యక ఔషధాల జాబితాలో తాజాగా చేర్చిన ఔషధాల మూలంగా కంపెనీలు రూ.600 కోట్లు కోల్పోతాయని చెప్పారు. ఇప్పటికే 2013-14లో రూ.1,000 కోట్ల ఆదాయం పరిశ్రమ కోల్పోయిందని వెల్లడించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అసాధారణ పరిస్థితుల్లో ఏ ఔషధం ధరనైనా నియంత్రించేందుకు డీపీసీవో 19వ ప్యారా ఎన్‌పీపీఏకు వీలు కల్పిస్తోంది. జాబితాలో ఉన్న ఔషధాలను తప్పకుండా ప్రభుత్వం నిర్దేశించిన ధరకే కంపెనీలు విక్రయించాలి. కావాల్సినవి ఇవే..: తక్కువ ధరకు స్థలం, విద్యుత్ సబ్సిడీ. వ్యర్థాల నిర్వహణకు కామన్ ప్లాంటు. సత్వర పర్యావరణ అనుమతులు. ఔషధ తయారీ అనుమతుల్లో పారదర్శకత. వడ్డీ రాయితీ. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి తక్కువ వడ్డీకి రుణం అందించాలని అంటున్నారు వీరమణి. ‘దేశీయ కంపెనీలకు కావాల్సిన ముడి సరుకులో 60-70% చైనాపైన ఆధారపడుతున్నాయి. దేశీయంగా తయారీని ప్రోత్సహించడం తప్ప మరో మార్గం లేదు’ అని అన్నారు. ప్లాంట్ల స్థాయి పెంపు, సిబ్బంది శిక్షణ, కొత్త మార్కెట్లకు విస్తరణకుగాను 9 వేల ఎంఎస్ఎంఈలు నిధుల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయని చెప్పారు. ఖాయిలాపడ్డ ప్రభుత్వ ఔషధ కంపెనీలను ప్రైవేటుకు అప్పగించాలన్నారు. ఏపీఐ పాలసీ త్వరలో..: యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్(ఏపీఐ) పాలసీ అయిదారు నెలల్లో కార్యరూపం దాలుస్తుందని ఐడీఎంఏ ఆశాభావం వ్యక్తం చేసింది. పాలసీ ద్వారా పరిశ్రమ డిమాండ్లకు పరిష్కారం లభిస్తుందని అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ టి.రవిచంద్రన్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో పరిశోధన, అభివృద్ధి వ్యయం తక్కువ. నిపుణులకు కొదవే లేదు. అందుకే జనరిక్ రంగంలోని విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడికి ఉవ్విల్లూరుతున్నాయని ఐడీఎంఏ పబ్లిక్ రిలేషన్ చైర్మన్ జె.జయశీలన్ తెలిపారు. రూ.5 వేల కోట్లు..: తెలంగాణలోనూ ట్యాక్స్ ఫ్రీ జోన్ చేస్తే రూ.5 వేల కోట్ల పెట్టుబడులు ఫార్మాలో వస్తాయని ఐడీఎంఏ తెలంగాణ ప్రెసిడెంట్ జె.రాజమౌళి తెలిపారు. ‘2005లో హైదరాబాద్‌లో 1,600 యూనిట్ల దాకా ఉండేవి. ఇప్పుడీ సంఖ్య 300లోపే. ప్రోత్సాహకాలు అందుకోవడానికి ట్యాక్స్ ఫ్రీ జోన్లు అయిన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకాశ్మీర్, సిక్కిం రాష్ట్రాలకు యూనిట్లు తరలిపోయాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లోని కంపెనీల వ్యాపారం రూ.60 వేల కోట్లపైమాటే’ అని తెలిపారు.