
సాక్షి, హైదరాబాద్: నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే విలవిల్లాడుతున్న సగటు జీవిపై మందుల భారం కూడా పడనుంది. జ్వరం బిళ్ల మొదలు బీపీ గోలీ వరకు సామాన్యులు ఎక్కువగా వినియోగించే దాదాపు 800 రకాల షెడ్యూల్డ్ మందులపై కేంద్రం ధరాభారం మోపింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆయా మందుల ధరలను 10.76 శాతం మేర పెంచుకొనేందుకు అనుమతిచ్చింది.
2020తో పోలిస్తే 2021 క్యాలెండర్ సంవత్సరానికి టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)లో 10.7 శాతం మేర వచ్చిన మార్పునకు అనుగుణంగా ధరలను సవరించుకొనేందుకు సంబంధిత వర్గాలకు అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) మెమొరాండం విడుదల చేసింది.
ఎక్కువ మంది వినియోగించేవే పెరుగుతాయి...
జ్వరం, ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, అనీమియా వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలన్నీ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెరుగుతాయి. ఇవిగాకుండా అత్యధికంగా వినియోగంలో ఉండే పారాసిటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడజోల్ వంటి ఔషధాల ధరలు కూడా పెరుగుతాయి. బలం కోసం వినియోగించే మల్టీ విటమిన్ల మందుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కరోనా వ్యాప్తి నుంచే వేగంగా పెరుగుదల...
దేశంలో ఔషదాల ధరల పెరుగుదల రెండేళ్లుగా కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి లాక్‌డౌన్, అనంతర పరిస్థితులకు అనుగుణంగా పలు రకాల మందుల ధరలు 20 శాతం దాకా పెరిగాయి.