ధరల నియంత్రణే ఫార్మాకు అడ్డంకి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలో పరిమాణం పరంగా మూడవ స్థానం. మొత్తం ఉత్పత్తిలో 10 శాతం. 210పైగా దేశాలకు ఎగుమతులు. ఇదీ ఔషధ తయారీలో భారత ప్రస్థానం. ఇంత ప్రత్యేకత ఉన్నప్పటికీ పరిశ్రమ మాత్రం అసంతృప్తిగా ఉంది. ఔషధ ధరల నియంత్రణ పరిశ్రమ వృద్ధికి ఆటంకంగా ఉందని ఇండియన్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(ఐడీఎంఏ) అంటోంది. ధరల నియంత్రణ పరిధిలోకి తెస్తున్న ఔషధాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని... ఎక్కడో దగ్గర అడ్డుకట్ట పడకపోతే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమని పేర్కొంది.
జాబితాలోకి మరిన్ని..
నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్‌పీపీఏ) ఇటీవలే ఆవశ్యక ఔషధాల జాబితాలోకి మధుమేహం, హృదయ సంబంధించి 50 ఔషధాలను చేర్చింది. ఇప్పటికే ఈ జాబితాలో పలు చికిత్సలకు సంబంధించిన 316 ఔషధాలు ఉన్నాయి. నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్‌ను జాబితాలోకి తీసుకురావడం డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డరు(డీపీసీవో)-2013కు విరుద్ధమని ఐడీఎంఏ అంటోంది. ఆవశ్యక ఔషధాల చిట్టా పెరుగుతూ పోతుంటే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమని ఐడీఎంఏ ప్రెసిడెంట్, ఫోర్ట్స్ ఇండియా ల్యాబొరేటరీస్ సీఎండీ ఎస్వీ వీరమణి సాక్షి బిజినెస్ బ్యూరోతో అన్నారు.
ఆవశ్యక ఔషధాల జాబితాలో తాజాగా చేర్చిన ఔషధాల మూలంగా కంపెనీలు రూ.600 కోట్లు కోల్పోతాయని చెప్పారు. ఇప్పటికే 2013-14లో రూ.1,000 కోట్ల ఆదాయం పరిశ్రమ కోల్పోయిందని వెల్లడించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అసాధారణ పరిస్థితుల్లో ఏ ఔషధం ధరనైనా నియంత్రించేందుకు డీపీసీవో 19వ ప్యారా ఎన్‌పీపీఏకు వీలు కల్పిస్తోంది. జాబితాలో ఉన్న ఔషధాలను తప్పకుండా ప్రభుత్వం నిర్దేశించిన ధరకే కంపెనీలు విక్రయించాలి.
కావాల్సినవి ఇవే..: తక్కువ ధరకు స్థలం, విద్యుత్ సబ్సిడీ. వ్యర్థాల నిర్వహణకు కామన్ ప్లాంటు. సత్వర పర్యావరణ అనుమతులు. ఔషధ తయారీ అనుమతుల్లో పారదర్శకత. వడ్డీ రాయితీ. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి తక్కువ వడ్డీకి రుణం అందించాలని అంటున్నారు వీరమణి. ‘దేశీయ కంపెనీలకు కావాల్సిన ముడి సరుకులో 60-70% చైనాపైన ఆధారపడుతున్నాయి. దేశీయంగా తయారీని ప్రోత్సహించడం తప్ప మరో మార్గం లేదు’ అని అన్నారు. ప్లాంట్ల స్థాయి పెంపు, సిబ్బంది శిక్షణ, కొత్త మార్కెట్లకు విస్తరణకుగాను 9 వేల ఎంఎస్‌ఎంఈలు నిధుల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయని చెప్పారు. ఖాయిలాపడ్డ ప్రభుత్వ ఔషధ కంపెనీలను ప్రైవేటుకు అప్పగించాలన్నారు.
ఏపీఐ పాలసీ త్వరలో..: యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్(ఏపీఐ) పాలసీ అయిదారు నెలల్లో కార్యరూపం దాలుస్తుందని ఐడీఎంఏ ఆశాభావం వ్యక్తం చేసింది. పాలసీ ద్వారా పరిశ్రమ డిమాండ్లకు పరిష్కారం లభిస్తుందని అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ టి.రవిచంద్రన్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో పరిశోధన, అభివృద్ధి వ్యయం తక్కువ. నిపుణులకు కొదవే లేదు. అందుకే జనరిక్ రంగంలోని విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడికి ఉవ్విల్లూరుతున్నాయని ఐడీఎంఏ పబ్లిక్ రిలేషన్ చైర్మన్ జె.జయశీలన్ తెలిపారు.
రూ.5 వేల కోట్లు..: తెలంగాణలోనూ ట్యాక్స్ ఫ్రీ జోన్ చేస్తే రూ.5 వేల కోట్ల పెట్టుబడులు ఫార్మాలో వస్తాయని ఐడీఎంఏ తెలంగాణ ప్రెసిడెంట్ జె.రాజమౌళి తెలిపారు. ‘2005లో హైదరాబాద్‌లో 1,600 యూనిట్ల దాకా ఉండేవి. ఇప్పుడీ సంఖ్య 300లోపే. ప్రోత్సాహకాలు అందుకోవడానికి ట్యాక్స్ ఫ్రీ జోన్లు అయిన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకాశ్మీర్, సిక్కిం రాష్ట్రాలకు యూనిట్లు తరలిపోయాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లోని కంపెనీల వ్యాపారం రూ.60 వేల కోట్లపైమాటే’ అని తెలిపారు.