
'సిగ్గుమాలిన పని చేసినవారిని వదలొద్దు'
న్యూఢిల్లీ: బెంగళూరు న్యూ ఇయర్ వేడుకల్లో మహిళలపై జరిగిన కీచకపర్వంపై ఏమిపట్టనట్లు వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోమంత్రి జీ పరమేశ్వరపై కేంద్రమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతా రాహిత్యం అవుతుందని హోంశాఖ సహాయమంత్రి కిరెణ్ రిజీజు అన్నారు. నేరస్తులను తప్పకుండా శిక్షించాల్సిందేనని చెప్పారు.
(బెంగళూరు ఘటనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు)
'ఇలాంటి సిగ్గుమాలిన పని చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టేందుకు మేం అంగీకరించం. బెంగళూరు చాలా వైబ్రంట్ సిటీ. అక్కడ మహిళలకు కచ్చితంగా రక్షణ కల్పించాల్సిందే' అని ఆయన అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి భారత సిలికాన్ వ్యాలీ బెంగళూరులోని ఎంజీ రోడ్డులో అమ్మాయిలు, మహిళలపై లైంగిక వేధింపులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కర్ణాటక హోంశాఖ మంత్రి స్పందిస్తూ ఇలాంటి సందర్భాలు అలాంటి ఘటనలు సహజం అన్నట్లుగా వ్యాఖ్యానించారు.