2013 నాటి ముజఫర్‌నగర్ అలర్లతో సొంతూరిని విడిచి.. కుటుంబంతోపాటు వేరే గ్రామానికి వలసవచ్చిన ఓ 14 ఏళ్ల బాలికపై దారుణం చోటుచేసుకుంది
ముజఫర్‌నగర్: 2013 నాటి ముజఫర్‌నగర్ అలర్లతో సొంతూరిని విడిచి.. కుటుంబంతోపాటు వేరే గ్రామానికి వలసవచ్చిన ఓ 14 ఏళ్ల బాలికపై దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు ఆ బాలికను అపహరించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్ జిల్లా అంబెటా గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో గ్రామ మాజీ ప్రధాన్ జహీర్ కొడుకు జుల్ఫమ్‌తోపాటు మరో ఇద్దరు యువకులపై పోలీసులు ఐపీసీ 376 (డీ) (గ్యాంగ్‌రేప్) ప్రకారం కేసు నమోదుచేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
బాధితురాలి సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. శనివారం బాధిత బాలిక పొలం దగ్గరికి వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తుండగా ముగ్గురు యువకులను ఆమెను అపహరించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో బాలిక అపస్మారక స్థితిలో కుటుంబసభ్యులకు కనిపించింది. ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు నిరసన తెలియజేయడంతో నిందితుడు వారిని చితకబాదాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 2013లో ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగిన మతఘర్షణల కారణంగా ఆ బాలిక కుటుంబం రోడ్డునపడింది. కట్టుబట్టలతో సొంతూరు విడిచిపెట్టి అంబెటాకు వలస వచ్చింది.