'చెత్తగా మాట్లాడాడు.. ముద్దుపెట్టుకోబోయాడు'
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కే పచౌరీ గురించి కొన్ని అసభ్యకర విషయాలు తెలిశాయి. ఆయన చాలా అసభ్యకరంగా మాట్లాడేవారని, బలవంతంగా ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించేవారని ఆయన వద్ద పనిచేస్తున్న పరిశోధక విద్యార్థిని తెలిపింది. జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముందు స్వయంగా వాంగ్మూలం ఇచ్చే సమయంలో ఆమె ఈ మాటలు చెప్పినట్లు సమాచారం.
ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్(తెరి) డైరెక్టర్ జనరల్గా ఆర్కే పచౌరీ పని చేస్తున్న సమయంలో ఆయన దగ్గర పరిశోధక విద్యార్థిగా చేరిన ఓ యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 164 కింద ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ నమోదుచేసుకున్నారు.
తొలిసారి రెండు రోజుల ఐదుగంటలపాటు మరోసారి 28గంటలపాటు ఆమె పచౌరీ చేష్టలపై వాంగ్మూలం ఇచ్చింది. 2014 మార్చి నెలలో మెక్సికోలోని లాస్ కాబోస్ కు క్లైమేట్ సమావేశం కోసం విమానంలో వెళుతున్న సమయంలో ఆయన తనను బెదిరించాడని, బాయ్ ఫ్రెండ్ కోసం ప్రయత్నిస్తే అతడి సంగతి తేలుస్తానంటూ కళ్లెర్రజేశాడని చెప్పింది. అదే రోజు తనను బలవంతంగా ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించడంతోపాటు అసభ్యకరంగా మాట్లాడాడని కూడా ఆమె వాంగ్మూలంలో చెప్పింది.