సాక్షి, బెంగళూరు (చిత్రదుర్గ): యువత పర్యాటకస్థలాలను చూడాలని బయల్దేరారు. ఎన్నో మధుర జ్ఞాపకాలతో తిరుగు ముఖం పట్టారు. మరికొద్ది గంటల్లో క్షేమంగా ఇళ్లల్లో ఉండేవారు. అయితే విధి వారిని ఒక్కసారిగా వక్రించింది. నూతన సంవత్సర విహారయాత్రను రోడ్డు ప్రమాదం భగ్నం చేయగా, ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. లారీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం వల్ల ఐదుగురి ఉజ్వల భవిత ఛిద్రమైంది.
చిత్రదుర్గ జిల్లాలోని సిబారు గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 5:30 సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇనుప కమ్మీల లోడ్‌తో వస్తున్న లారీ, విద్యార్థుల ట్రాక్స్ క్రూయిజర్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోరం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లా సమీపంలోని గోకాక్‌లోని మున్నాళ ప్రాంతానికి చెందిన వివిధ కళాశాలల్లో బీఏ, ఎం.కాం చదువుతున్న 11 మంది విద్యార్థులు నూతన సంవత్సరం సందర్భంగా గత శనివారం మైసూరు, మడికేరి ప్రాంతాల పర్యటనకు ట్రాక్స్ వాహనంలో బయలుదేరారు. వీరంతా తమ విహారయాత్రను ముగించుకొని ఆదివారం రాత్రి తమ సొంత ప్రాంతాలకు బయలుదేరారు. 4వ నంబర్ జాతీయ రహదారిపై చిత్రదుర్గ సమీపంలోని సిబార గ్రామం వద్ద ట్రాక్స్‌ను ఇనుప కమ్మీల లోడ్‌తో వెళుతున్న లారీ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ట్రాక్స్ డ్రైవర్ సురేష్‌తో పాటు శివలింగ కుక్కనూరు, సిద్ధార్థ, వినోద్, రాకేష్‌లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
బాధితులందరూ యువకులే
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహంతేష్, రమేష్, సిద్ధార్ధ దుండయ్య, హీరేమఠ, సోమశేఖర, సునీల్ రమేష్ పాటిల్, ఆనంద్‌లను చిత్రదుర్గ, దావణగెరె జిల్లా ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వాహనాల శకలాలు, మృతదేహాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. కాగా, మృతులంతా 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే. చిత్రదుర్గ ఎస్పీ శ్రీనాథ్ ఎం. జోషి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో నిర్లక్ష్యంగా లారీని నడపడంతో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాగా, చిత్రదుర్గ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment