అక్కడ ప్రతిరోజు 34 మరణాలు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకు రోడ్లు నెత్తురోడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రతిరోజు 34 మంది మృత్యువాత పడుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ అధికారికంగా వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు హరియానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లలో ప్రమాదాల శాతం ఎక్కువగా ఉంది.
2016 ఏడాదిలో 12,481 మంది మృత్యువాత పడగా, 2015లో ఈ సంఖ్య 11,914గా నమోదైనట్లు ఆ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 'భారత్‌లో రోడ్డు ప్రమాదాలు-2016' నివేదిక ప్రకారం ఈ నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలోనే ప్రమాద మృతుల సంఖ్య అధికంగా ఉంది. గతేడాది పంజాబ్‌లో 5077 మంది, హరియానాలో 5024 మంది, హిమాచల్ ప్రదేశ్ 1,271 మంది, జమ్ముకశ్మీర్‌లో 958 మంది వ్యక్తులు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం, సైకిల్, బైక్, కారు, ఇతర వాహనాల మీద వెళ్తుండగా జరిగిన ప్రమాదాల్లో మృతిచెందారు. 333 మంది సైక్లిస్ట్‌లు చనిపోగా, అత్యధికంగా పంజాబ్‌లో 202 మంది, హరియానాలో 102 మంది, చండీగఢ్‌లో 28 మంది, జమ్ముకశ్మీర్‌లో ఒక్కరు చనిపోయారు.
హరియానాలో 1596 మంది పాదచారులు చనిపోయారని, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తర్వాత నాల్గో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో 60 మంది మహిళలు సహా 433 మంది పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. పాదచారుల మృతుల సంఖ్యలో చండీగఢ్ 38 మందితో చివరి స్థానంలో ఉండగా, జమ్ముకశ్మీర్ 58 మందితో చివరి నుంచి రెండోస్థానంలో ఉంది.
పాదచారులు రోడ్డుపై సురక్షితంగా ఉండాలంటే కాలిముద్రలు రోడ్డుపై అచ్చువేస్తే కొద్దిమేరకు ఈ కేటగిరిలో చావులను అరికట్టవచ్చునని రోడ్డ భద్రతా నిపుణుడు నవదీప్ అసిజా అన్నారు. పంజాబ్‌లో 2014లో 566 మంది పాదచారులు చనిపోగా, 2016లో ఈ సంఖ్య 635కు చేరిందన్నారు. లైసెన్స్‌లేనివారు, 18 ఏళ్లలోపు టీనేజర్లు వాహనాలు నడపటం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అదే రీతిలో వారి మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.
18 ఏళ్లలోపు వారి వల్ల జరిగిన ప్రమాదాలు..
హరియానా 591
పంజాబ్ 327
జమ్ముకశ్మీర్ 137
హిమాచల్‌ప్రదేశ్ 48
చండీగఢ్ 5