సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : బికనీర్ భూ ఒప్పందం కేసుకు సంబంధించి సోనియా గాంధీ అల్లుడు, వాణిజ్యవేత్త రాబర్ట్ వాద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. బికనీర్‌లో భూముల కొనుగోలుకు అధిక వడ్డీతో ఓ కంపెనీ రుణం సమకూర్చిందని, ఈ రుణం వాద్రాకు పన్ను ఎగవేతలకు ఉపకరించిందని, ఆదాయ పన్ను సెటిల్‌మెంట్ నుంచి ఉపశమనం కలిగిందనే వార్తలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఈడీ నుంచి సమన్లు రావడం గమనార్హం. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నిర్వాసితులకు ఉద్దేశించిన కోయాపేట్ ప్రాంతంలోని భూ లావాదేవీల్లో అక్రమాలపై ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది.
ఈ వ్యవహారంలో ఈడీ 2015లో మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్‌ఏ) కింద క్రిమినల్ కేసు నమోదు చేసింది. చట్టవిరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల పేరుతో కేటాయింపులు జరిగాయని రెవెన్యూ శాఖ నిర్ధారించడంతో రాజస్ధాన్ ప్రభుత్వం 374 హెక్టార్ల భూమి హక్కుల బదలాయింపులను రద్దు చేసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లోనూ 2008లో ఓ భూ కుంభకోణానికి సంబంధించిన మరో కేసులోనూ వాద్రా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
వాద్రా వివరణ
బికనీర్ భూ కుంభకోణంపై ఈడీ సమన్లు జారీ చేయడంపై రాబర్ట్ వాద్రా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ తరహా కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. రాఫేల్ డీల్, ఇతర అంశాలపై బీజేపీని ప్రశ్నించిన ప్రతిసారీ తన పేరును బయటికి లాగుతున్నారని మండిపడ్డారు. తనపై వచ్చిన అభియోగాలన్నీ న్యాయస్ధానాల పరిధిలో ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment