Bikaner land deal
-
రాబర్ట్ వాద్రా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ : లండన్‌లో అక్రమాస్తుల కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు బికనీర్ భూ కుంభకోణం కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి వాద్రా కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీ లిమిటెడ్‌కు చెందిన రూ 4.62 కోట్ల విలువైన ఆస్తులను శుక్రవారం ఈడీ అటాచ్ చేసింది. ఇదే కేసులో మరికొందరి ఇతరుల ఆస్తులనూ ఈడీ అటాచ్ చేసింది. భూ నిర్వాసితులకు కేటాయించిన భూమిని రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ కేవలం రూ 72 లక్షలకే దాదాపు 150 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అదే భూమిని రూ 5.15 కోట్లకు అలిగెన్సీ అనే కంపెనీకి విక్రయించారని ఈడీ ఆరోపిస్తోంది. అక్రమ లావాదేవీ ద్వారా ఆయన మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ వాద్రాపై అభియోగాలు మోపింది. -
తల్లితోపాటు ఈడీ ఎదుట వాద్రా
జైపూర్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా, అతని తల్లి మౌరీన్ వాద్రా మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. రాజస్తాన్‌లోని బికనీర్ జిల్లాలో భూ కుంభకోణానికి పాల్పడ్డారని వాద్రాపై పలు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా తన భర్త, అత్తతోపాటు వచ్చి జైపూర్‌లోని ఈడీ కార్యాలయం వద్ద వారిని వదిలివెళ్లారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అధికారులు ముందుగా రాబర్ట్ వాద్రాను, కొద్దిసేపటి తర్వాత మౌరీన్‌ను విచారణ నిమిత్తం లోపలికి పిలిచారు. సుమారు 9 గంటలపాటు రాబర్ట్ వాద్రాను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. బుధవారం కూడా హాజరుకావాల్సి ఉం టుందని ఆయనకు తెలిపారు. బికనీర్‌లో 2015లో జరిగిన భూ లావాదేవీల్లో వాద్రా ఫోర్జరీకి పాల్పడ్డారంటూ అప్పటి తహశీల్దార్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దీంతోపాటు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ కొనుగోళ్లు చేపట్టిన స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో గల సంబంధాలపైనా వాద్రాను ఈడీ ప్రశ్నించిందని సమాచారం. ఈ కేసులో ఈడీ మూడుసార్లు సమన్లు ఇచ్చినప్పటికీ రాబర్ట్ వాద్రా స్పందించలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిటిషన్‌పై స్పందించిన రాజస్తాన్ హైకోర్టు.. విచారణకు సహకరించాలంటూ వాద్రాతోపాటు ఆయన తల్లి మౌరీన్‌ను ఆదేశించింది. అయితే, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ ఈడీకి స్పష్టం చేసింది. -
రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : బికనీర్ భూ ఒప్పందం కేసుకు సంబంధించి సోనియా గాంధీ అల్లుడు, వాణిజ్యవేత్త రాబర్ట్ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. బికనీర్‌లో భూముల కొనుగోలుకు అధిక వడ్డీతో ఓ కంపెనీ రుణం సమకూర్చిందని, ఈ రుణం వాద్రాకు పన్ను ఎగవేతలకు ఉపకరించిందని, ఆదాయ పన్ను సెటిల్మెంట్ నుంచి ఉపశమనం కలిగిందనే వార్తలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఈడీ నుంచి సమన్లు రావడం గమనార్హం. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నిర్వాసితులకు ఉద్దేశించిన కోయాపేట్ ప్రాంతంలోని భూ లావాదేవీల్లో అక్రమాలపై ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఈడీ 2015లో మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్ఏ) కింద క్రిమినల్ కేసు నమోదు చేసింది. చట్టవిరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల పేరుతో కేటాయింపులు జరిగాయని రెవెన్యూ శాఖ నిర్ధారించడంతో రాజస్ధాన్ ప్రభుత్వం 374 హెక్టార్ల భూమి హక్కుల బదలాయింపులను రద్దు చేసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లోనూ 2008లో ఓ భూ కుంభకోణానికి సంబంధించిన మరో కేసులోనూ వాద్రా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వాద్రా వివరణ బికనీర్ భూ కుంభకోణంపై ఈడీ సమన్లు జారీ చేయడంపై రాబర్ట్ వాద్రా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ తరహా కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. రాఫేల్ డీల్, ఇతర అంశాలపై బీజేపీని ప్రశ్నించిన ప్రతిసారీ తన పేరును బయటికి లాగుతున్నారని మండిపడ్డారు. తనపై వచ్చిన అభియోగాలన్నీ న్యాయస్ధానాల పరిధిలో ఉన్నాయన్నారు. -
రాజస్థాన్ సర్కార్‌పై రాబర్ట్ వాద్రా ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : బికనీర్ భూ ఒప్పందంపై సీబీఐ విచారణకు రంగం సిద్దమవుతున్న క్రమంలో రాబర్ట్ వాద్రా రాజస్థాన్ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. తనను టార్గెట్‌గా చేసుకుని రాజస్థాన్ ప్రభుత్వం వేధిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భూ కుంభకోణంలో తన ప్రమేయం ఉన్నట్టు ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదని వాద్రా అన్నారు. ‘నన్ను ఎంతైనా వేధించండి...వెంటాడండి...ప్రాసిక్యూట్ చేసుకోండి..ఇలాంటి అసత్యాలు నిజాన్ని కప్పిపుచ్చలేవు’ అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. రాజస్థాన్ ప్రభుత్వం తనపై సాగిస్తున్న కుట్రపూరిత ప్రచారంలో ఇది ఓ భాగమేనని ఆయన అన్నారు. బికనీర్ భూముల ఒప్పందంలో వాద్రా పాత్రను నిగ్గుతేల్చేందుకు రాజస్ధాన్ ప్రభుత్వం సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాదాన్యత సంతరించుకున్నాయి. -
సీబీఐకి రాబర్ట్ వాద్రా బికనీర్ స్కామ్
జైపూర్: రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో భూముల ఒప్పందానికి సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా నిందితుడైన బికనీర్ భూములు, మనీ ల్యాండరింగ్ కేసులను త్వరలో సీబీఐ విచారించనుంది. ఈ కేసులపై సీబీఐ విచారణ కోరుతూ రాజస్థాన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్టు రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా తెలిపారు. ఈ కేసు ప్రాధాన్యత, సుదీర్ఘంగా విచారణ సాగుతున్న క్రమంలో తదుపరి సీబీఐచే విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశామని చెప్పారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీలు 275 బిగాల భూమి అక్రమ క్రయవిక్రయాల్లో పాలుపంచుకున్నాయని ఆరోపణలున్నాయి. మహజన్ ఫైరింగ్ రేంజ్ కోసం సేకరించిన భూమికి పరిహారంగా ఈ స్థలాలను కేటాయించారని 2010 నుంచి వీటి క్రయవిక్రయాల్లో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని చెప్పారు. అధికారులు నకిలీ గుర్తింపులు, పేర్లతో భూములను ఇతరులకు రిజిస్టర చేశారనే అనుమానాలున్నందునే సీబీఐ విచారణ కోరామని తెలిపారు.