జైపూర్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా, అతని తల్లి మౌరీన్ వాద్రా మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. రాజస్తాన్‌లోని బికనీర్ జిల్లాలో భూ కుంభకోణానికి పాల్పడ్డారని వాద్రాపై పలు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా తన భర్త, అత్తతోపాటు వచ్చి జైపూర్‌లోని ఈడీ కార్యాలయం వద్ద వారిని వదిలివెళ్లారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అధికారులు ముందుగా రాబర్ట్ వాద్రాను, కొద్దిసేపటి తర్వాత మౌరీన్‌ను విచారణ నిమిత్తం లోపలికి పిలిచారు. సుమారు 9 గంటలపాటు రాబర్ట్ వాద్రాను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. బుధవారం కూడా హాజరుకావాల్సి ఉం టుందని ఆయనకు తెలిపారు.
బికనీర్‌లో 2015లో జరిగిన భూ లావాదేవీల్లో వాద్రా ఫోర్జరీకి పాల్పడ్డారంటూ అప్పటి తహశీల్దార్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దీంతోపాటు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ కొనుగోళ్లు చేపట్టిన స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో గల సంబంధాలపైనా వాద్రాను ఈడీ ప్రశ్నించిందని సమాచారం. ఈ కేసులో ఈడీ మూడుసార్లు సమన్లు ఇచ్చినప్పటికీ రాబర్ట్ వాద్రా స్పందించలేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పిటిషన్‌పై స్పందించిన రాజస్తాన్ హైకోర్టు.. విచారణకు సహకరించాలంటూ వాద్రాతోపాటు ఆయన తల్లి మౌరీన్‌ను ఆదేశించింది. అయితే, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ ఈడీకి స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment