వాలెంటైన్స్ డే.. మీరేం చేస్తున్నారు?
టిక్.. టిక్.. టిక్.. గడియారం చప్పుడవుతోంది. మరికొన్ని గంటలు గడిస్తే చాలు.. వేలెంటైన్స్ డే వచ్చేస్తోంది. మరి ఈసారి మీరు ఏం చేస్తున్నారు? ప్రియురాలికి వెరైటీగా ఏం గిఫ్టు ఇస్తున్నారు? సరిగ్గా ఇదే విషయమై ఓ సర్వే చేస్తే.. చాలామంది మంచి రొమాంటిక్ డిన్నర్‌కు తీసుకెళ్తామని చెబుతున్నారట. మరికొందరు మాత్రం ఓ అడుగు ముందుకేసి.. తమ నెచ్చెలిని హెలికాప్టర్ రైడ్‌కు తీసుకెళ్తామని అంటున్నారు. 'నియర్‌బై' అనే సంస్థ 3వేల మందిని సర్వే చేయగా, వాళ్లలో 45 శాతం మంది రొమాంటిక్ డిన్నర్ వైపే మొగ్గు చూపారు. 39 శాతం మంది మాత్రం వాళ్ల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన గిఫ్టు ఇస్తామని చెప్పారు. 18 శాతం మంది అయితే.. తమ ప్రియురాలిని హెలికాప్టర్ ఎక్కించి అలా 'గాల్లో తేలినట్టుందే.. గుండె పేలినట్టుందే' అని పాటలు పాడేస్తామన్నారట.
అయితే ఎక్కువ మంది మాత్రం రూ. 3 వేల నుంచి రూ. 5వేల వరకు మాత్రమే వేలెంటైన్స్ డే సందర్భంగా ఖర్చుపెడతామని.. అంతకంటే ఎక్కువ వదిలించుకునేది లేదని స్పష్టం చేశారు. ఇందులో కూడా ఏవైనా ఆఫర్లు, కూపన్లు ఉన్నాయేమోనని నెట్ ప్రపంచం మొత్తాన్ని గాలిస్తున్నారు. అసలు వేలైంటెన్స్ డే ఎందుకు జరుపుకొంటారని అడిగినప్పుడు.. తమ ప్రేమను ప్రకటించడానికే అని 43 శాతం మంది చెప్పారు. 21 శాతం మంది మాత్రం అసలు జీవితంలో దీనికి మించిన సరైన పని ఏముంటుందని అడిగారు. మిగిలిన 13 శాతం మంది అందరితో కలిసి.. తోటి స్నేహితుల ఒత్తిడి వల్లే ఈ సంబరాలలో పాల్గొంటున్నట్లు చెప్పారు! సర్వేలో పాల్గొన్నవాళ్లలో 62 శాతం మంది తాము చిట్టచివరి నిమిషం వరకు ప్లానింగ్‌లోనే ఉంటామని తెలిపారు.