ఆ సమాధి.. మయాన్ రాజుదేనా?!
సాక్షి, వాషింగ్టన్ : ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతల్లో మయాన్ నాగరికత ఒకటి. నేటి అమెరికాలోని గ్వాటమెలలో ఈ నాగరికత విస్తరించిందని ఆధారాలున్నాయి. మయాన్లకు ద్రవిడులకు, మయాన్లకు సింధూనాగరికతకు మధ్య వ్యత్యాసాలున్నాయని.. చాలా ఏళ్లుగా చరిత్ర పరిశోధకులు, విమర్శకులు అంటున్నారు. మయాన్ల నాగరికత ఎలా ఎదిగింది..? ఎందుకు నాశనం అయిందన్న దానిపై ఆధారాలు పెద్దగా లేవు. తాజాగా మయాన్ రాజుగా చెప్పబడే.. ఒక సమాధి గ్వాటెమెలలో బయపడింది. ఆ సమాధి వెలుగులోకి రావడంతో చాలా ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయనే నమ్మకంతో పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మయాన్ నాగరికతలో ఒక చక్రవర్తి సమాధిని అమెరికాలోని గ్వాటెమెలలో బయట పడింది. కొన్నేళ్లుగా అమెరికా ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌వారు.. మయాన్ నాగరికత విలసిల్లిన ఈ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్న విషయం విదితమే. రాజు సమాధి చిన్న సైజు ప్యాలెస్ ఉండడంతో ఆర్కియాలజీ అధికారులు ఆశ్చర్చపోయారు. మయాన్ రాజు గురించిన మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. బ్రిటన్‌లోని సాక్సాన్ రాజుల సమాధులను ఈ సమాధి పోలివుందని వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ ఫ్రెడెల్ చెప్పారు.
ఈ సమాధిలోని రాజు క్రీ.పూ. 300 - 350 మధ్య కాలంలో జీవించి ఉండొచ్చని ఆర్కియాలజీ సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో వెలుగుచూసిన సమాధులుకన్నా ఇది చాలా పురాతనమైనదని వారు అంటున్నారు. సమాధిలో పురాతన మయాన్ నాగరికతకు సంబంధించిన అనేక వస్తువులు బంగారు ఆభరణాలు ఉన్నాయని ఆర్కియాలజీ అధికారులు ప్రకటించారు.