న్యూఢిల్లీ/చండీగఢ్: డెంగీ జ్వరంతో బాధపడుతున్న ఏడేళ్ల బాలికకు చికిత్స అందించినందుకు రూ.16 లక్షలు వసూలు చేసి, అప్పటికీ చిన్నారి ప్రాణాలను కాపాడలేకపోయిన ఓ ఆసుపత్రి బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. హరియాణాకు చెందిన ఆద్యా సింగ్ అనే చిన్నారికి డెంగీ జ్వరం రావడంతో గుర్గావ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గత ఆగస్టు 31న చేర్పించారు. బాలికకు 15 రోజులు చికిత్స అందించిన ఆసుపత్రి సిబ్బంది... ఆమె తల్లిదండ్రుల నుంచి రూ.16 లక్షలు వసూలు చేశారు.
అయినా చిన్నారిని మృత్యువు నుంచి కాపాడలేకపోయారు. ఆసుపత్రి వర్గాలు భారీగా డబ్బు గుంజిన విషయాన్ని బాలిక తండ్రి స్నేహితుడొకరు ఇటీవల ట్వీటర్‌లో బయటపెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మంగళవారం స్పందిస్తూ దీన్ని దురదృష్టకర సంఘటనగా అభివర్ణించారు. ఇలా ఎక్కువ రుసుములు వసూలు వేయకుండా వైద్యశాలలను నియంత్రించేందుకు ఓ చట్టం కూడా ఉందనీ, దానిని అనుసరించాల్సిందిగా గతంలోనూ తాము అన్ని రాష్ట్రాలనూ కోరామనీ, మరోసారి ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామని చెప్పారు.
బాలిక మృతి కేసుపై విచారణ జరపాలని కేంద్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని నడ్డా ఆదేశించారు. అనంతరం కార్యదర్శి హరియాణా ప్రభుత్వానికి లేఖ రాయడంతో ఆసుపత్రిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆసుపత్రి యాజమాన్యం మాత్రం బాలికకు చికిత్స అందించడంలో తాము ఏ మాత్రం నిర్లక్ష్యం వహించలేదనీ, అన్ని నిబంధనలను పాటించామనీ, చికిత్సకు అవుతున్న ఖర్చు గురించి కూడా ఎప్పటికప్పుడు బాలిక కుటుంబానికి తెలియజేశామంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment