న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన పార్టీల అభ్యర్థులంతా విధిగా తమ ఆస్తులను ప్రకటించారు. 58 స్థానాల కోసం మార్చి 23న జరుగనున్న ఎన్నికకు సంబంధించి.. సోమవారంతో నామినేషన్ల గడువు పూర్తైంది. మంగళవారం(13న) నామినేషన్ల పరిశీలన చేపడతారు. వీటిలో మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం కాబోతుండటం తెలిసిందే. కాగా, ఈ సందర్భంలోనే.. ‘దేశంలోనే ధనిక ఎంపీ’ కిరీటం తలమారుతుండటం గమనార్హం. ఇన్నాళ్లూ రవీంద్ర కిశోర్ సిన్హాకు దక్కిన ఆ ప్రత్యేకత ఇకపై జయా బచ్చన్ సొంతంకానుంది. అవును. ఎన్నికల అఫిడవిట్‌లో రూ.1000కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించిన ఆమె దేశంలోనే ధనిక ఎంపీగా నిలవబోతున్నారు.
జయా బచ్చన్ సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇందుకోసం సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తనతోపాటు భర్త అమితాబ్‌వి కలిపి రూ.1000 కోట్ల ఆస్తులున్నట్లు తెలిపారు. అదే 2012లో ఆమె తన ఆస్తిని రూ.460 కోట్లుగా చెప్పుకున్నారు. అంటే, గడిచిన ఐదేళ్లలో బచ్చన్ దంపతుల ఆస్తి కళ్లుచెదిరేరీతిలో రెట్టింపైందన్నమాట! బిహార్‌కు చెందిన రవీంద్ర కిశోర్ సిన్హా.. 2014 రాజ్యసభ ఎన్నికలో రూ.800 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచీ ఆయనే ‘రిచెస్ట్ ఎంపీ’గా కొనసాగారు. ఇప్పుడు జయ రూ.1000కోట్ల ప్రకటనతో కిశోర్ రెండో స్థానానికి పడిపోయారు.
ఆయనకు ఒక ట్రాక్టర్, నానో కారు కూడా: బచ్చన్ దంపతుల మొత్తం సంపదలో స్థిరాస్థి విలువ రూ.460 కోట్లుకాగా, చరాస్తుల విలువ రూ.540 కోట్లు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దగ్గర రూ.36కోట్ల విలువచేసే ఆభరణాలున్నాయట. అదే జయ ఆభరణాల విలువ రూ.26 కోట్లు. దంపతులిద్దరికీ రోల్స్‌రాయిస్, మెర్సిడెజ్, రేంజ్ రోవర్ తదితర బ్రాడ్ల కారు మొత్తం 12 ఉన్నాయి. కాగా, అమితాబ్ పేరుమీద ఒక ట్రాక్టర్, నానో కారు కూడా ఉన్నట్లు చెప్పుకున్నారు. ఇక దంపతులిద్దరి దగ్గరా రూ.5 కోట్ల విలువైన చేతి గడియారాలున్నాయి. బిగ్ బీ దగ్గరున్న రూ.9 లక్షల పెన్నును కూడా అఫిడవిట్‌లో పొందుపర్చారు. వీరికి ఫ్రాన్స్‌లోని బ్రిగ్‌నోగన్‌లో 3,175 చదరపు మీటర్ల నివాస స్థలం ఉంది. భారత్‌లోనైతే నోయిడా, భోపాల్, పుణె, అహ్మదాబాద్, గాంధీనగర్, ముంబై, లక్నోల్లో స్థలాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment