Richest MP
-
దేశంలో ధనిక ఎంపీ ‘కింగ్’ మహేంద్ర!
సాక్షి, పాట్నా : రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన పార్టీల అభ్యర్థులంతా విధిగా తమ ఆస్తులను ప్రకటిస్తున్న నేపథ్యంలో అత్యంత సంపన్న నేతగా జేడీయూ (బిహార్)కు చెందిన మహేంద్ర ప్రసాద్ నిలిచారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉన్న జయా బచ్చన్ రూ.1000 కోట్ల ఆస్తులను అఫిడవిట్లో వెల్లడించి ధనిక ఎంపీగా నిలిచిన విషయం తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్స్ పరిశీలన పూర్తికాగా రూ.4,039 కోట్ల ఆస్తులతో జేడీయూ అభ్యర్థి, ఎంపీ మహేంద్ర అగ్రస్థానంలో నిలిచారు. దాంతో సంపన్న ఎంపీల జాబితాలో జయా బచ్చన్ రెండో స్థానానికి పడిపోయారు. 58 స్థానాల కోసం మార్చి 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. జేడీయూ తరఫున మూడోసారి రాజ్యసభకు వెళ్లనున్న మహేంద్ర ప్రసాద్ ఓవరాల్‌గా ఏడోసారి ఎగువ సభలో అడుగుపెట్టనున్నారు. కింగ్ మహేంద్రగా పేరు గాంచిన మహేంద్ర ప్రసాద్.. తన అఫిడవిట్లో రూ.4,010.21 కోట్ల చరాస్తులు, రూ. 29 కోట్ల స్థిరాస్తులు కలిగిఉన్నట్లు వెల్లడించారు. మాప్రా లాబోరేటరిస్ ప్రైవేట్ లిమిటెడ్, అరిస్టో ఫార్మాసూటికల్స్ కు అధిపతిగా ఉన్నారు. సొంత వాహనమే లేని ధనిక ఎంపీ నాలుగు వేల కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్న ఎంపీగా ఉన్న మహేంద్రకు ఒక్క వాహనం కూడా లేదని తెలిపారు. తన పేరుతో ఒక్క ఇన్సూరెన్స్ పాలసీ కూడా లేదని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తొలిసారి 1980లో కాంగ్రెస్ అభ్యర్థిగా నెగ్గి పార్లమెంటులో అడుగుపెట్టిన మహేంద్ర ప్రసాద్.. తాజాగా ఏడోసారి రాజ్యసభలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. జేడీయూ నుంచి బరిలో నిలిచారు. 211 దేశాల్లో పర్యటించిన ఏకైక ఎంపీగా ఆయనదే రికార్డ్. -
దేశంలోనే ధనిక ఎంపీ ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన పార్టీల అభ్యర్థులంతా విధిగా తమ ఆస్తులను ప్రకటించారు. 58 స్థానాల కోసం మార్చి 23న జరుగనున్న ఎన్నికకు సంబంధించి.. సోమవారంతో నామినేషన్ల గడువు పూర్తైంది. మంగళవారం(13న) నామినేషన్ల పరిశీలన చేపడతారు. వీటిలో మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం కాబోతుండటం తెలిసిందే. కాగా, ఈ సందర్భంలోనే.. ‘దేశంలోనే ధనిక ఎంపీ’ కిరీటం తలమారుతుండటం గమనార్హం. ఇన్నాళ్లూ రవీంద్ర కిశోర్ సిన్హాకు దక్కిన ఆ ప్రత్యేకత ఇకపై జయా బచ్చన్ సొంతంకానుంది. అవును. ఎన్నికల అఫిడవిట్లో రూ.1000కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించిన ఆమె దేశంలోనే ధనిక ఎంపీగా నిలవబోతున్నారు. జయా బచ్చన్ సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇందుకోసం సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనతోపాటు భర్త అమితాబ్‌వి కలిపి రూ.1000 కోట్ల ఆస్తులున్నట్లు తెలిపారు. అదే 2012లో ఆమె తన ఆస్తిని రూ.460 కోట్లుగా చెప్పుకున్నారు. అంటే, గడిచిన ఐదేళ్లలో బచ్చన్ దంపతుల ఆస్తి కళ్లుచెదిరేరీతిలో రెట్టింపైందన్నమాట! బిహార్‌కు చెందిన రవీంద్ర కిశోర్ సిన్హా.. 2014 రాజ్యసభ ఎన్నికలో రూ.800 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచీ ఆయనే ‘రిచెస్ట్ ఎంపీ’గా కొనసాగారు. ఇప్పుడు జయ రూ.1000కోట్ల ప్రకటనతో కిశోర్ రెండో స్థానానికి పడిపోయారు. ఆయనకు ఒక ట్రాక్టర్, నానో కారు కూడా: బచ్చన్ దంపతుల మొత్తం సంపదలో స్థిరాస్థి విలువ రూ.460 కోట్లుకాగా, చరాస్తుల విలువ రూ.540 కోట్లు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దగ్గర రూ.36కోట్ల విలువచేసే ఆభరణాలున్నాయట. అదే జయ ఆభరణాల విలువ రూ.26 కోట్లు. దంపతులిద్దరికీ రోల్స్‌రాయిస్, మెర్సిడెజ్, రేంజ్ రోవర్ తదితర బ్రాడ్ల కారు మొత్తం 12 ఉన్నాయి. కాగా, అమితాబ్ పేరుమీద ఒక ట్రాక్టర్, నానో కారు కూడా ఉన్నట్లు చెప్పుకున్నారు. ఇక దంపతులిద్దరి దగ్గరా రూ.5 కోట్ల విలువైన చేతి గడియారాలున్నాయి. బిగ్ బీ దగ్గరున్న రూ.9 లక్షల పెన్నును కూడా అఫిడవిట్లో పొందుపర్చారు. వీరికి ఫ్రాన్స్‌లోని బ్రిగ్‌నోగన్‌లో 3,175 చదరపు మీటర్ల నివాస స్థలం ఉంది. భారత్‌లోనైతే నోయిడా, భోపాల్, పుణె, అహ్మదాబాద్, గాంధీనగర్, ముంబై, లక్నోల్లో స్థలాలున్నాయి. -
పాక్ ఎంపీల్లో అత్యంత ధనికుడు నవాజ్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ పార్లమెంటు సభ్యుల్లోకెల్లా అత్యంత ధనవంతుడు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫే. ఆయన ఆస్తి పాక్ కరెన్సీలో రూ.150 కోట్లకుపైగా ఉందని పాక్ ఎన్నికల సంఘం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మిగిలిన ఎంపీల్లో చాలా మంది చక్కెర, వస్త్ర రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, భూస్వాములు, వ్యాపారులున్నారని పేర్కొంది. ఎన్నికల సంఘానికి సమర్పించిన డిక్లరేషన్‌లో నవాజ్ షరీఫ్ పేర్కొన్న ఆస్తుల జాబితాలో రూ.143 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, రూ.1.30 కోట్ల మేర పెట్టుబడులు, 6 మిల్లుల్లో షేర్లు, వివిధ బ్యాంకుల్లో రూ.12.6 కోట్ల నగదు, ఓ టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనం, రెండు బెంజ్ కార్లు, 1991 మోడల్ ట్రాక్టర్, భార్య పేర రూ.15 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి.