ద.మ.రైల్వేకు 2,500 కోట్లివ్వండి
- రైల్వే మంత్రి సురేశ్ ప్రభును కోరిన దత్తాత్రేయ
- ఎంఎంటీఎస్ ఫేజ్-2తోపాటు సూపర్ ఫాస్ట్ రైళ్లకోసం విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ మధ్య రైల్వేకు వచ్చే బడ్జెట్‌లో రూ. 2,500 కోట్ల మేర నిధులు మంజూరు చేయాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఇక్కడ రైల్వే మంత్రి కార్యాలయంలో సురేశ్ ప్రభుతో ఆయన భేటీ అయ్యారు. ‘కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా చేపట్టిన మెదక్ -అక్కన్నపేట్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం తన వాటాను ఇప్పటికే కేటాయించింది. ఇక కేంద్రం కూడా 50% వాటాను ఇవ్వాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా రైల్వే బడ్జెట్‌లో ప్రకటనే చేయాలి. అలాగే మీర్జాపల్లి నుంచి మెదక్‌కు కొత్త రైల్వే లైను ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలి. అజంతా ఎక్స్‌ప్రెస్‌కు అక్కన్నపేట్ రైల్వే స్టేషన్‌లో హాల్ట్ కల్పించాలి’ అని దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎంఎంటీఎస్ ఫేజ్-2ను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని కోరారు. ఇందుకోసం తాజా బడ్జెట్‌లో రూ. 200 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మణుగూరు-రామగుండం లైనుకు 100 కోట్లు, అక్కన్నపేట్-మెదక్‌కు రూ.40 కోట్లు, భద్రాచలం రోడ్-కొవ్వూరుకు రూ. 100 కోట్లు, నంద్యాల-ఎర్రగుంట్లకు రూ. 40 కోట్లు, కడప-బెంగళూరు లైనుకు రూ. 100 కోట్లు, నడికుడి-శ్రీకాళహస్తి లైనుకు రూ.309 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్-ఖాజీపేట మూడో లైనుకు, హైదరాబాద్-నిజాంపేట, హైదరాబాద్-మహబూబ్‌నగర్-కర్నూలు లైనుకు, హైదరాబాద్-బీబీనగర్-నడికుడి లైన్లకు విద్యుదీకరణ పనులు చేపట్టాలని విన్నవించారు.
కొత్త రైళ్లు వేయండి..
హైదరాబాద్ నుంచి తిరుపతి, కోయంబత్తూరు మీదుగా మధురైకి కొత్తగా సూపర్ ఫాస్ట్ రైలు నడపాలని దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. అలాగే సికింద్రాబాద్-బెంగళూరు మధ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ నడపాలన్నారు. హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-నల్లగొండ మధ్య ఇంటర్‌సిటీ రైళ్లను నడపాలని కోరారు. హైదరాబాద్ లో రాత్రి బయలుదేరి తెల్లవారే సరికి ముంబై చేరేలా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని కోరారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బుల్లెట్ రైలు నడపాలని విన్నవించారు. కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని.. మౌలాలీ, శేరిలింగపల్లిలో కొత్త టెర్మినళ్లు ఏర్పాటుచేయాలన్నారు.