
నెలకు రూపాయి ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాదబీమా
దేశంలో చాలామందికి ఎలాంటి ఆరోగ్య, ప్రమాద, జీవిత బీమా లేదని, చాలా మందికి పింఛను కూడా రావట్లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఇందుకోసం త్వరలోనే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. దీనికింద ఏడాదికి 12 రూపాయల ప్రీమియంతో.. అంటే, నెలకు రూపాయి ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. అంటే, ఈ ప్రీమియం కట్టినవాళ్లు ఎవరైనా ప్రమాదాల్లో మరణిస్తే, వాళ్ల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఇస్తారన్నమాట.
ప్రధానమంత్రి జనధన యోజన కింద అందరికీ సామాజిక భద్రత కల్పించాలన్నదే తమ ఉద్దేశమని, అందులో భాగంగా పింఛను సదుపాయం కూడా ఇస్తామన్నారు. ప్రతినెలా ఈ ఖాతాలో పేదలు ఎంత ఆదా చేస్తే అందులో సగం మళ్లీ ప్రభుత్వం కూడా కలుపుతుందని, 60 ఏళ్ల వయసు దాటినప్పటినుంచి వారికి పింఛను వస్తుందని అన్నారు. అలాగే, 18-50 ఏళ్ల మధ్యవారికి ఏడాదికి రూ. 335 ప్రీమియంతో మరో ప్రమాదబీమా కల్పిస్తామన్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటుచేస్తామని, వృద్ధుల కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.