తెలంగాణకు కేంద్రం మొండిచేయి
సాక్షి, ఖమ్మం:
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, 2015-16 బడ్జెట్ ఇందుకు నిదర్శనమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సోమవారం ఖమ్మం లో పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన సమయం లో రాష్ట్రానికి ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మైనింగ్, ఉద్యానవన వర్శిటీలు, ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించి బడ్జెట్‌లో మాత్రం ఈ అంశాల ఊసే ఎత్తలేదన్నారు. భద్రాచలం-కొవ్వూ రు రైల్వే లైన్‌కు మొక్కుబడిగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుందని ఆరోపిం చారు.
భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసి రైతుల ఆందోళనకు అండగా నిలిచిందన్నారు. కేం ద్రం నుంచి నిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇందుకు బీఆర్‌జీఎఫ్ నిదర్శనమని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మొదటి వి డత ఇచ్చిన బీఆర్‌జీఎఫ్ ఖర్చు చేయలేదన్న సాకుతో కేంద్రం ఈసారి రాష్ట్రానికి మొండి చేయి చూపినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు బుగ్గకార్లు పెట్టుకోగానే సరిపోదని నిధుల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా సూచించారు.
మేనిఫెస్టో మరచిన టీఆర్‌ఎస్
మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను టీఆర్‌ఎస్ అమలు పరచకుండా విస్మరించిందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ రూ.లక్షల కోట్లు దాటాలనే తపనే తప్పా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. తొలి స్వల్పకాలిక బడ్జెటే వాస్తవంగా లేదని ప్రతిపక్షాలతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీలో గళమెత్తిందన్నారు. ఎన్నికలకు ముందు సీఎం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి ఆకుల మూర్తి, సంయుక్త కార్యదర్శి షర్మిల సంపత్, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఇల్లెందు, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జులు గుగులోతు రవిబాబునాయక్, సాధు రమేషరెడ్డిలు పాల్గొన్నారు.