రూ.257 కోట్ల ‘కింగ్’ ఖాన్!
సెలబ్రిటీల్లో ఈ ఏడాది ఆదాయపరంగా షారుఖ్‌కు తొలి స్థానం
ఆ తర్వాతి స్థానాల్లో సల్మాన్, అమితాబ్
100 మంది సెలబ్రిటీల జాబితా ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఆదాయపరంగా మళ్లీ సత్తా చాటాడు. ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ ఇండియా పత్రిక ప్రకటించిన 100 మంది అత్యధిక సంపాదనపరులైన సెలబ్రిటీల జాబితాలో తిరిగి తొలిస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. గతేడాది తొలి స్థానంలో నిలిచిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఈసారి రెండో స్థానానికినెట్టి తొలి స్థానానికి మళ్లీ ఎగబాకాడు. 2014లో మూడో స్థానంలో ఉన్న షారుక్ ఈ ఏడాది రూ. 257.5 కోట్ల ఆదాయ అంచనాతో అగ్రస్థానంలో నిలవగా రూ. 202.75 కోట్ల ఆదాయ అంచనాతో సల్మాన్ రెండో స్థానంలో నిలిచాడు.
గతేడాది రెండో స్థానంలో ఉన్న అమితాబ్ బచ్చన్ రూ. 112 కోట్ల ఆదాయంతో ఈ ఏడాది మూడో స్థానానికి పరిమితమయ్యాడు. టీం ఇండియా వన్డే క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రూ. 119.33 కోట్లతో నాలుగో స్థానం, ఆమిర్‌ఖాన్ రూ. 104.25 కోట్లతో ఐదో స్థానంలో నిలిచారు. టాప్ 10లోని ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అక్షయ్ కుమార్ రూ. 127.83 కోట్లు, విరాట్ కోహ్లీ రూ. 104.78 కోట్లు, సచిన్ టెండూల్కర్ రూ. 40 కోట్లు, దీపికా పదుకొనే రూ. 59 కోట్లు, హృతిక్ రోషన్ రూ. 74.5 కోట్లు ఉన్నారు.
జాబితాలోని తెలుగు సెలబ్రిటీలలో రూ. 51.5 కోట్లతో మహేశ్‌బాబు 36వ ర్యాంకు, రూ. 37.5 కోట్లతో అల్లు అర్జున్ 42వ ర్యాంకు(38 ర్యాంకులు మెరుగుపరుచుకొని), రూ. 26 కోట్లతో ఎస్.ఎస్.రాజమౌళి 72వ, రూ. 24 కోట్లతో ప్రభాస్ 77వ, రూ. 15.67 కోట్లతో పూరీ జగన్నాథ్ 89వ స్థానంలో నిలిచారు. సెలబ్రిటీల ఆదాయంతోపాటు వారి ఖ్యాతినీ పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులు ప్రకటించారు. పన్ను చెల్లింపులకు ముందు ఉన్న సెలబ్రిటీల ఆదాయాన్ని, వారి ఖ్యాతి స్కోర్లను కలిపి ర్యాంకులను వెల్లడించారు.