అత్యధికంగా ఆర్జిస్తున్న హీరోలెవరో తెలుసా?
ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న నటుల జాబితాను తాజాగా ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసింది. ఈ జాబితాలో మార్క్ వాల్‌బెర్గ్ మొదటిస్థానంలో నిలువగా ముగ్గురు భారతీయ స్టార్లకూ చోటు దక్కింది. 38 మిలియన్ డాలర్ల (రూ. 243.50 కోట్ల) ఆర్జనతో ఈ లిస్ట్‌లో షారుఖ్ ఖాన్ ఎనిమిదో స్థానంలో నిలువగా, 37మిలియన్ డాలర్ల (రూ. 237 కోట్ల) ఆదాయంతో సల్మాన్ ఖాన్ తొమ్మిదో స్థానంలో, 35.5 మిలియన్ డాలర్ల (రూ. 227.5 కోట్ల) ఆదాయంతో అక్షయ్‌కుమార్ పదోస్థానంలో నిలిచారు.
ప్రపంచంలో అత్యధికంగా ఆర్జించే నటుల జాబితాలో బాలీవుడ్ స్టార్లు చోటు సంపాదించడం కొత్త కాదు. కానీ, ఈ ఏడాది జాబితాలో బాలీవుడ్ అగ్ర కథనాయకుడు ఆమిర్‌ఖాన్ పేరు లేకపోవడం గమనార్హం. ఆమిర్ తాజా చిత్రం 'దంగల్' ఒక్క చైనాలోనే రూ. 2వేల కోట్ల (312 మిలియన్ డాలర్లు) వసూలు చేసింది. గత ఏడాది డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమా భారత్‌లోనూ కనీవినీ ఎరుగని రికార్డు వసూళ్లను సొంతం చేసుకుంది. అయినా ఫోర్బ్స్ జాబితాలో ఆమిర్ పేరు లేకపోవడం విస్మయం కలిగిస్తోంది.
ట్రాన్స్‌పార్మర్ హీరో వార్క్ వాల్‌బెర్గ్ 68మిలియన్ డాలర్ల సంపదతో అత్యధికంగా ఆర్జిస్తున్న నటుల జాబితాలో మొదటిస్థానంలో నిలిచాడు. అతని తాజా సినిమా ట్రాన్స్‌ఫార్మర్స్: ద లాస్ట్ నైట్ సినిమా ఫ్లాప్ అయినా.. నిర్దిష్టమొత్తంలో అతనికి రెమ్యూనరేషన్ అందడంతో టాప్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
ఇక, హాలీవుడ్ న్యూ సూపర్‌స్టార్ డ్వైన్ 'ది రాక్' జాన్సన్ 65 మిలియన్ డాలర్ల ఆదాయంతో రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో విన్ డీసెల్ (54.5 మిలియన్ డాలర్లు), ఆడం సాండ్లర్ (50.5 మిలియన్ డాలర్లు), జాకీ చాన్ (49 మిలియన్ డాలర్లు) నిలిచారు. ఐరన్ మ్యాన్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్, టాం క్రూస్ ఐదు, ఆరు స్థానాలను సొంతం చేసుకున్నారు.