రోజులు మారుతున్నాయి.. కథల ఎంపిక కూడా మారుతోంది.. హీరోలు ఎన్ని సినిమాలు చేస్తున్నామనే కాదు.. సినిమాకు ఎంత తీసుకుంటున్నామన్నది కూడా లెక్కలేసుకుంటున్నారు. మూవీ బడ్జెట్‌ను బట్టి, దర్శకుడు అడిగే కాల్షీట్లను బట్టి ఇదిగో నాకింత కావాలంటూ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు ఒక్క సినిమాకే కోట్లు వెనకేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా హీరోలు? ఎవరి రెమ్యునరేషన్ ఎంత? అన్న విషయాలు తెలియాలంటే ఇది చదివేయండి..
అక్షయ్ కుమార్
బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో అక్షయ్ కుమార్ ముందు వరుసలో ఉంటాడు. ఈయన రమారమిగా ఒక్క సినిమాకు రూ.135 కోట్లు అందుకున్నట్లు సమాచారం. లేదంటే సినిమా రిలీజయ్యాక దానికి వచ్చే లాభంలో 40 నుంచి 50 శాతం వరకు వాటా తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటాడట! సూర్యవంశి చిత్రానికి రూ.70 కోట్లు, బచ్చన్ పాండేకు రూ.90 కోట్లు తీసుకుంటూ వచ్చిన ఆయన బెల్ బాటమ్‌కు ఏకంగా రూ.117 కోట్లు పుచ్చుకున్నట్లు తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్
ఇండియాలో రూ.100 కోట్ల పారితోషికం తీసుకున్న మొట్టమొదటి హీరో సల్మాన్ ఖాన్. 2016లో సుల్తాన్ చిత్రానికి వంద కోట్లు వెనకేసిన ఆయన ఆ మరుసటి ఏడాది వచ్చిన టైగర్ జిందా హైకి రూ.130 కోట్లు అందుకున్నాడు. కొన్ని చిత్రాలకు నిర్మాతలను డబ్బులు డిమాండ్ చేయడం మానేసి సినిమా డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తన ఇన్‌కమ్‌గా మార్చుకున్నాడు. భారత్ సినిమా డిజిటల్ రైట్స్‌కు రూ.80 కోట్లు, శాటిలైట్ రైట్స్‌కు రూ.40 కోట్లు రాగా ఈ మొత్తాన్ని అంటే రూ.120 కోట్లను తన జేబులో వేసుకున్నాడు సల్లూ భాయ్. అంటే ఈ భాయ్‌జాన్ సినిమా చేయాలంటే అతడు అడిగినంత డబ్బులు ముట్టజెప్పాలి లేదంటే లాభాల్లో దాదాపు 70% వాటా ఇవ్వాలి, అదీ కాదంటే శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మితే వచ్చిన డబ్బులను అతడికి అప్పజెప్పాలన్నమాట!
షారుక్ ఖాన్
మోస్ట్ హ్యాండ్సమ్ హీరో షారుక్ ఖాన్ సినిమాకు సైన్ చేసేటప్పుడే దాని లాభాల్లో ఎంత వాటా ఇస్తారో మాట్లాడుకుంటాడట! ఇన్ని కోట్లు పారితోషికం కావాలని డిమాండ్ చేయకుండా సినిమా లాభాల్లో 60% వాటా ఇవ్వమని కోరుతాడట.
అమీర్ ఖాన్
అమీర్ ఖాన్ కూడా రెమ్యునరేషన్‌ను పట్టించుకోకుండా సినిమా లాభాల మీదనే ప్రత్యేక దృష్టి పెడతాడని తెలుస్తోంది. అందుకే ఆయన నటించిన ఏ సినిమా అయినా రిలీజయ్యాక దానికి వచ్చే ప్రాఫిట్‌లో నుంచి 75 శాతం వరకు వాటా తనే తీసుకుంటాడని సమాచారం.
హృతిక్ రోషన్
లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న ఆరడుగుల అందగాడు హృతిక్ రోషన్ కూడా షారుక్, అమీర్ బాటలోనే నడుస్తున్నాడు. తన ప్రతి సినిమాకు వచ్చే ఆదాయంలో నుంచి 50-55% మధ్య వాటా తన జేబులో వేసుకుంటాడని తెలుస్తోంది.
రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' సినిమాకు రూ.65-70 కోట్లు తీసుకోగా రణ్‌వీర్ సింగ్ 'సర్కస్' చిత్రానికి రూ.50 కోట్లు పుచ్చుకున్నాడట. వరుణ్ ధావన్ కూడా పారితోషికం కంటే ప్రాఫిట్‌లో కొంత వాటా తీసుకోవడమే నయమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'సత్యమేవ జయతే'కి రూ.7 కోట్లు తీసుకున్న జాన్ అబ్రహాం దాని సీక్వెల్‌కు రూ.21 కోట్లు తీసుకున్నట్లు భోగట్టా. 'జెర్సీ'కి షాహిద్ కపూర్ రూ.31 కోట్లు సంపాదించాడట.
మొన్నటిదాకా రూ. 30 కోట్ల లోపే పారితోషికం తీసుకుంటున్న టైగర్ ష్రాఫ్ 'గనపత్' సినిమాకు మాత్రం ఏకంగా 40 కోట్ల రూపాయల మేర రెమ్యునరేషన్ అందుకున్నాడట. అంతేకాదు, 'బడే మియా చోటే మియా'కు ఏకంగా రూ.50 కోట్లు తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక అజయ్ దేవ్‌గన్ రూ.35-40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నా దానితో సరిపెట్టుకోకుండా ఆ సినిమాకు వచ్చే లాభాల్లో 50 శాతం వాటా తీసుకుంటాడని సమాచారం!
Comments
Please login to add a commentAdd a comment