
ఆ ఉద్యోగి పరుపు కింద రూ.60 లక్షలపైనే..
మధ్యప్రదేశ్: అతను ఓ మాములు ప్రభుత్వ ఉద్యోగి. జీతం కూడా సాదాసీదాగానే.. కానీ, కూడబెట్టిన ఆస్తులు మాత్రం తనిఖీలకు వచ్చిన అధికారులను నోళ్లు వెళ్ళబెట్టేలా చేశాయి. మొత్తం రూ.60 లక్షల పైబడిన ఆస్తులు అతడి వద్ద ఉన్నట్లు గుర్తించడంతోపాటు ఇంట్లో ఒక్క పరుపు కిందే ఏకంగా రూ. ఏడులక్షలు లిక్విడ్ క్యాష్ తో పాటు ఐదు ఐఫోన్లు, 20 ఖరీదైన గడియారాలు అధికారులకు లభించాయి. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని నీమూచ్ అనే ప్రాంతంలో నరేంద్ర గాంగ్వల్ అనే వ్యక్తి ఓ కలెక్టరేట్ లో చిరుద్యోగి.
ఇటీవల కాలంలో అతడు ఎక్కువ మొత్తంలో అక్రమాస్తులు పోగేశాడని సమాచారం అందడంతో లోకాయుక్త పోలీసులు అతడి ఇంటిపై అనూహ్యంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వారికి మొత్తం రూ.55 లక్షల విలువైన ఆస్తుల ధ్రువపత్రాలు, రూ.7లక్షల నగదు, పది లక్షల విలువైన బంగారు ఆభరణాలు బెడ్ కింద లభించాయి. సరిగ్గా గాంగ్వాల్ గోవా టూర్ కు వెళదామనుకున్న సమయంలోనే అధికారులు ఈ దాడులు చేసి అతగాడికి ఝలక్ ఇచ్చారు. ఇక బ్యాంకు లాకర్ నుంచి రెండు కేజీల వెండి, పావు కేజీ బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సంబంధిత ఆరోపణల పేరిట కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.