గోవులను పూజిస్తారు.. హింస తెలీదు
గోవులను పూజిస్తారు.. హింస తెలీదు
Published Mon, Sep 18 2017 11:58 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM
సాక్షి, జైపూర్: గో రక్షక దళాల పేరిట జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయాలంటూ ఈ మధ్యే సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు సూచించిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రతీ జిల్లాకు డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఓ టాస్క్ ఫోర్స్ బృందాన్ని నియమించాలని ఆదేశించింది కూడా. ఈ నేపథ్యంలో గో రక్షక దళాలను ఉద్దేశించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్‌లో ఆరు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఆయన జైపూర్, జామ్‌దోలిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆవులను దైవంగా పూజించే వారు చాలా ప్రశాంత మనస్తతత్వంతో ఉంటారని, ఎదుటివారు తమ మనోభావాలను దారుణంగా దెబ్బ తీసినా చాలా ఓపికతో ఉంటారని ఆయన చెప్పారు. అంతేకానీ హింసకు ఎట్టిపరిస్థితుల్లో పాల్పడబోరని భగవత్ పేర్కొన్నారు. మరి దాడులకు పాల్పడుతుంది గో రక్షక దళ సభ్యులు కాదా? అన్న ప్రశ్నకు భగవత్ సమాధానం దాటవేశారు.
ఆవులను అక్రమంగా తరలిస్తున్నాడని ఆరోపిస్తూ కొంతమంది గో సంరక్షకులు ఈ యేడాది ఏప్రిల్ నెలలో రాజస్థాన్‌లోనే ఓ ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన విషయం తెలిసిందే. పెహ్లూ ఖాన్(50) అనే డైరీ ఫాం రైతుపై విచక్షణా రహితంగా అతని మీద దాడి చేయడంతో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆరుగురు నిందితులకు నేర పరిశోధన విభాగం ఈ మధ్యే పోలీసులు క్లీన్‌చీట్ ఇవ్వగా.. స్థానికంగా పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తమైంది. తాము సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు పెహ్లూ కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.
Advertisement
Advertisement