ఇఫ్తార్ విందులకు ఆర్ఎస్ఎస్ నేతలు!
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. నూటికి నూరుశాతం హిందూ సంస్థ. అందులోనూ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎంత ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అలాంటిది, గుజరాత్లో నిర్వహించిన ఇఫ్తార్ పార్టీకి ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు!! ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎంఆర్ఎం) నిర్వహించిన ఇఫ్తార్ పార్టీలకు ఆర్ఎస్ఎస్ నేతలు వెళ్తున్నారు. 2002 సంవత్సరంలో నాటి ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ కేఎస్ సుదర్శన్ సూచనల మేరకు ఎంఆర్ఎం సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది గుజరాత్లో ఇప్పటివరకు ఏడు ఇఫ్తార్ పార్టీలు నిర్వహించారు. వడోదరలో ఈనెల 21న నిర్వహించిన ఇఫ్తార్ పార్టీకి బీజేపీ సీనియర్ నాయకుడు జయంతి బారోత్, ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ హాజరయ్యారు.
వడోదరలోని పురుషోత్తం హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు దాదాపు 800 మంది హాజరయ్యారని, ఇలాంటి వాటి వల్ల రాష్ట్రంలో మత సామరస్యం వెల్లివిరుస్తోందని ఎంఆర్ఎం రాష్ట్ర సమన్వయకర్తల గనీ ఖురేషీ అన్నారు. ఆగస్టు మూడో తేదీన మెగా ఈద్ మిలన్ సంబరాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ అధికారులు మాత్రం తమంతట తాముగా ఈ విందులకు వెళ్లడంలేదు. ఆర్ఎస్ఎస్ తనంతట తానుగా ఎలాంటి ఇఫ్తార్ విందులు నిర్వహించడంలేదని గుజరాత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ జయంతి భదేషియా తెలిపారు. ఎంఆర్ఎంతో తమకు సంబంధం లేదని కూడా అన్నారు.