ఆరెస్సెస్ అనుబంధ సంస్థకు పీఎంవో షాక్
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తో అనుబంధమున్న విజ్ఞాన భారతి సంస్థకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి ఊహించని షాక్ ఎదురైంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో తమకు ప్రదానం చేయాల్సిన అవార్డును చివరిక్షణంలో పీఎంవో తిరస్కరించడంపై ఆ సంస్థ నిరసన వ్యక్తంచేస్తోంది.
దేశీయ విజ్ఞానాన్ని (సైన్స్) అభివృద్ధి పరిచేందుకు కృషిచేస్తున్న విజ్ఞానభారతి సంస్థకు అనిల్ కకోద్కర్, జీ మాధవన్ నాయర్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 7న ఢిల్లీ ఐఐటీలో భారీస్థాయిలో 'ప్రాక్టికల్ సైన్స్ లెసెన్స్'ను నిర్వహించడం ద్వారా ఈ సంస్థ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సపాదించింది. గతంలో ఈ రికార్డు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ పేరిట ఉండేది. ఈ ఘనతను గుర్తించిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తమకు అవార్డు ప్రకటించామని, దీనిని అందుకునేందుకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు రావాలని తెలిపిందని విజ్ఞానభారతి ప్రధాన కార్యదర్శి ఏ జయకుమార్ తెలిపారు.
కానీ చివరినిమిషంలో ఈ అవార్డుకు పీఎంవో నుంచి అనుమతి రాలేదంటూ తమకు సమాచారమిచ్చారని, ఇది తీవ్ర దిగ్భ్రాంతికరమని, శాస్త్రవేత్తల లోకానికి షాక్ లాంటిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఎంవో తిరస్కారానికి కారణాలేమిటో కూడా తమకు తెలుపలేదని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని ఆయన కోరారు.