సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ఆరెస్సెస్ ‘నిశ్శబ్ద ప్రచారం’ను ప్రారంభించింది. ప్రతి నియోజక వర్గంలో 200 నుంచి 250 మంది ఆరెస్సెస్ వాలంటీర్లు ఈ ప్రచారాన్ని సాగిస్తున్నారు. భారత మాత ప్రతిష్టను పరిరక్షించుకోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మరింత బలోపేతం చేయాలని, అందుకు కర్ణాటకలో బీజేపీ అభ్యర్థులను గెలుపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరెస్సెస్ ఓ డాక్యుమెంట్‌లో పేర్కొంది. ఉత్తర మంగళూరు, దక్షిణ మంగళూరు నియోజక వర్గాల్లో రహస్యంగా పంచుతున్న ఈ డాక్యుమెంట్ ప్రతి ఒకటి మీడియాకు చిక్కింది.
తమదీ ఓ సాంస్కతిక సంస్థ అని, తాము ఎప్పుడూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనమని ఎప్పుడూ చెప్పుకునే ఆరెస్సెస్ సంస్థ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయినప్పటి నుంచి బీజేపీ తరఫున బూత్ స్థాయి ప్రచారం చేయడం బహిరంగ రహస్యమే. కర్ణాటక ఆరెస్సెస్ వాలంటీర్లు ఒక్కొక్కరు ఇంటింటికి తిరిగి ఇంకా ఓటు ఎటువేయాలో నిర్ణయించుకోని కనీసంగా వంద నుంచి రెండు వందల కుటుంబాల పెద్దలను గుర్తించాలని, వారి వివరాలను సేకరించి నియోజక వర్గం ఆరెస్సెస్ కోఆర్డినేటర్లకు పంపించాలని డాక్యుమెంట్‌లో తమ వాలంటీర్లకు ఆరెస్సెస్ విజ్ఞప్తి చేసింది. తామెవరో చెప్పుకోకుండానే బీజేపీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకత గురించి సదరు కుటుంబ పెద్దకు నచ్చచెప్పాలన్నది ఆరెస్సెస్ సూచన.
ఒక్కో వాలంటీరు కుబుంబ పెద్దల ద్వారా 25వేల నుంచి 50వేల మంది ఓటర్లను గుర్తించాలని, వారంతా పోలింగ్‌కు వచ్చేలా చూడాలని ఆరెస్సెస్ సూచించింది. కాంగ్రెస్, ఇతర పార్టీలు హిందూ మతాన్ని, హిందూ నాయకులను మంట కలిపేందుకు ప్రయత్నిస్తున్నాయని, అందులో భాగంగా ఆరెస్సెస్ లాంటి సంస్థలను టెర్రరిస్టు సంస్థలుగా ముద్ర వేస్తున్నాయని, ముస్లిం, క్రైస్తవుల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్, తదితర పార్టీలు కషి చేస్తున్నాయని, తదితర అంశాల ప్రాతిపదికన ప్రచారం సాగించాలని సూచించింది. మంగళూరుకు హరికష్ణ నాయక్‌ను కోఆర్డినేటర్‌గా డాక్యుమెంట్ పేర్కొంది. ఆయన మంగళూరులో కాలేజీ విద్యార్థి ప్రముఖ్. ఇదే విధంగా బెంగళూరు నియోజకవర్గానికి హర్షవర్దన్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజేష్ పద్మర్ ద్వారా హర్షవర్దన్‌ను కలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment