కర్ణాటక ఎన్నికలు.. బీజేపీకి ఆరెస్సెస్‌ షాక్‌ | RSS Internal Survey on Karnataka Poll Shocks BJP | Sakshi
Sakshi News home page

Published Thu, May 3 2018 8:30 AM | Last Updated on Wed, Sep 5 2018 1:55 PM

RSS Internal Survey on Karnataka Poll Shocks BJP - Sakshi

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా.. పక్కన యడ్యూరప్ప

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికలకు సంబంధించి బీజేపీకి మాతృసంస్థ ఆరెస్సెస్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు మించి రాబోవని తేల్చి చెప్పింది. ఈ మేరకు అంతర్గత సర్వే వివరాలను దక్షిణ భారత ప్రాంతీయ ప్రముఖ్‌ వి నాగరాజ్‌.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాకు అందించినట్లు సమాచారం. 

బీజేపీ 70 లేదా ఆ లోపు సీట్లతోనే సరిపెట్టుకుంటుంది, కాంగ్రెస్‌కు 115 నుంచి 120 సీట్లు, జేడీఎస్‌ 29-34 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. నివేదికలో బీజేపీ వైఫల్యాలకు సంబంధించిన వివరాలను కూడా పొందుపరిచినట్లు తెలుస్తోంది. జీఎస్టీ ఎఫెక్ట్‌, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపు, నిరుద్యోగ సమస్య, తదితరాలు తీవ్ర ప్రభావం చూపటంతో బీజేపీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిపింది. ఇవిగాక రాజకీయ విశ్లేషణలో భాగంగా.. దళిత ఓట్లను క్రోడీకరించే విషయంలో బీజేపీ దారుణంగా విఫలమైందని.. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పకు లింగాయత్‌ కులస్తులపై పట్టుతప్పిందని, అన్నింటికి మించి గాలి జనార్దన్‌ అనుచరులకు పెద్దపీట వేయటం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లిందని నివేదికలో పేర్కొంది. 

అయితే ఈ సర్వే నివేదిక విషయాన్ని బీజేపీ వర్గాలు తోసిపుచ్చాయి. ఆరెస్సెస్‌ సర్వేలు అత్యంత గోప్యంగా ఉంటాయని, అలాంటప్పుడు ఈ నివేదికను ఎలా నమ్ముతారంటూ బీజేపీ నేత ఒకరు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ అవకాశాలను దెబ్బ తీసేందుకే కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ నివేదిక సంగతి పక్కపెడితే ఇప్పటిదాకా వెలువడ్డ పలు సర్వే నివేదికలు మాత్రం స్పష్టమైన మెజార్టీ బీజేపీకి దక్కవనే తేల్చాయి. దీంతో బీజేపీలో వణుకు మొదలైంది. ఈ క్రమంలోనే జేడీఎస్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement