ప్రధాని మోదీ (పాత ఫొటో)
సాక్షి, బెంగళూరు : దక్షిణాదిలో ఇంకో దఫా పాగా వేసేందుకు తహతహలాడుతున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తప్పదేమోననే భయం గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. బీజేపీ మిత్ర పక్షమైన ఆరెస్సెస్ నిర్వహించిన సర్వేలో బీజేపీకి 70 సీట్లకు మించి రావాని తేల్చిచెప్పడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
మిగతా సర్వేలు కూడా దాదాపు బీజేపీకి ప్రతికూలంగా రావడంతో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. ఆరెస్సెస్ సర్వే బహిర్గత విషయాన్ని బీజేపీ ఖండించినా..లోలోపల మాత్రం చాలా మదనపడుతోంది. ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగానే మోదీ ఎన్నికల పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చేశారు. మొదటగా మే 1 నుంచి ఐదు రోజుల పాటు 15 ర్యాలీల్లో పాల్గొనాలకున్న మోదీ, తన పర్యటనను మరో నాలుగు జిల్లాలకు పెంచి మొత్తం 21 ర్యాలీల్లో పాలు పంచుకోనున్నారు.
హంగ్ ఏర్పడే అవకాశాలు ఉండటంతో జేడీఎస్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను బీజేపీ మొదలెట్టేసింది. అందుకే ఉడిపిలో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. దేవగౌడపై ప్రశంసల జల్లు కురిపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జేడీఎస్‌ను బీజేపీకి తోక పార్టీ అని విమర్శించినా స్పందించలేదు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో నేతల మధ్య మాటల యుద్ధాలు బాగా పెరిగిపోయాయి.
సోషల్ మీడియాను వేదిక చేసుకుని ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. మోదీ చరిష్మా, అమిత్‌షా వ్యూహం కర్ణాటక ఎన్నికల్లో ఫలిస్తాయో లేదో వేచి చూడాలి మరి. ఈ నెల 12న ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. మే 15 ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment