చిక్కబళ్లాపురం: కర్ణాటకలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఏకమై బీజేపీని ఓడించాలని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ప్రచారంలో భాగంగా శనివారం నగరంలోని సర్‌ఎం విశ్వేశ్వరయ్య క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోదీ చెప్పేది ఒకటి చేసేది మరొకటని అన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ. 15 లక్షలను జమ చేస్తామన్నారు, చేశారా? అని ప్రశ్నించారు. మేక్‌ఇన్‌ఇండియా, స్టార్టప్ ఇండియా, సిటప్ ఇండియా ఇవన్నీ ఏమైనట్టు అని అన్నారు. ‘నీరవ్‌మోదీ వంటివారు రూ.30 వేల కోట్లను దోచుకొని పరారయ్యారు, వారి గురించి మాట్లాడరేం. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం అంటే యడ్యూరప్పదే అంటారు.
మహారాష్ట్ర వంటి రాష్ట్రాల కన్నా కర్ణాటక ఎంతో అభివృద్ధి చెందింది అని వారే చెబుతారు. నోట్లను రద్దు చేసి పేదలను బ్యాంకుల ముందు నిలబెడతారు’ అని మండిపడ్డారు. ‘మోదీ అంబేడ్కర్ ఫోటో ముందు నిలబడి నమస్కారం చేస్తారు, అయితే దళిత వ్యతిరేక విధానాలను అనుసరిస్తారు’ అన్నారు. సీఎం సిద్ధరామయ్య ప్రసంగిస్తూ మోదీ తప్పుడు హామీలనిస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టారన్నారు. ఎత్తినహోళె పథకంలో ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు బీజేపీ నేతలు దళితులను నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు వారింటికి వెళ్లి హోటల్ నుంచి తెప్పించిన భోజనాలను ఆరగిస్తారు, సిగ్గు చేటు అని విమర్శించారు. కాగా, కోలారు, ముళబాగిలు, కేజీఎఫ్‌లలోనూ రాహుల్‌గాంధీ సభల్లో పాల్గొని ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment