
కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే కన్నుమూత
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామంత్రి గోపినాథ్ ముండే (64) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈరోజు ఉదయం 6.30 గంటలకు గోపీనాథ్ ముండే ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దాంతో ఆయన్ని చికిత్స నిమిత్తం ఎయిమ్స్కు తరలించారు. ఎయిమ్స్ ట్రామా సెంటర్కు ఆయనను తీసుకొచ్చేసరికి ఆయనకు ఊపిరి అందట్లేదని, రక్తపోటు ఏమాత్రం లేదని, నాడి కూడా కొట్టుకోవట్లేదని, గుండె ఆడట్లేదని, అందువల్ల తాము వెంటనే పావుగంట పాటు సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీససికేషన్) చేశామని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. తాము ఎంత తీవ్రంగా ప్రయత్నించినా ఆయన శరీరం స్పందించలేదని అందువల్ల ఉదయం 7.20 నిమిషాలకు మరణించినట్లు ధ్రువీకరించామని చెప్పారు. ప్రమాదం జరిగిన పది నిమిషాలలోనే ముండేను ఆయన పీఏ ఆస్పత్రికి తీసుకొచ్చారని అన్నారు. దక్షిణ ఢిల్లీలోని అరబిందో మార్గ్ సమీపంలో ప్రమాదం జరిగింది.
కాగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గోపీనాథ్ ముండే భౌతికకాయాన్ని బీజేపీ కార్యాలయానికి తీసుకు వెళ్లనున్నట్లు బీజేపీ నేత నితీన్ గడ్కరీ తెలిపారు. ఆయన మృతి పట్ల బీజేపీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. వారం రోజుల క్రిందట కేంద్రమంత్రిగా గోపీనాథ్ ముండే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ముండే స్వస్థలం మహారాష్ట్ర పరాలీ. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. బుధవారం ముండే భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
1980లో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ముండే అయిదుసార్లు మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1995-99 మధ్యకాలంలో ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గోపీనాథ్ ముండే రెండు లక్షల మెజార్టీతో గెలుపొందారు. కేంద్రమంత్రిగా ఆయన వారం రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.