సేఫ్టీ సర్టిఫికెట్ జారీయే తరువాయి
న్యూఢిల్లీ: మండి హౌస్-సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో మార్గంలో భద్రతా తనిఖీ ప్రక్రియ ఇటీవల పూర్తయింది. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్) సెంట్రల్ కమిషనర్ ఆమోదమే ఇక మిగిలిఉంది. ఈ ప్రక్రియ కూడా పూర్తయితే ఈ మార్గంలో సేవలు నగరవాసులకు అందుబాటులోకి వస్తాయి. మూడో దశలో భాగంగా ఈ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గాన్ని ఈ నెల పదో తేదీన భద్రతా విభాగం అధికారులు తనిఖీ చేసిన సంగతి విదితమే. సేఫ్టీ సర్టిఫికెట్ వచ్చేందుకు మరో వారం రోజుల వ్యవధి పట్టే అవకాశముందని సంబ ంధిత వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ విషయమై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) అధికార ప్రతినిధి మాట్లాడుతూ సీఎంఆర్‌ఎస్ నుంచి భద్రతా పత్రం (సేఫ్టీ సర్టిఫికెట్) వచ్చేదాకా ఈ మార్గంలో సేవలను ప్రారంభించలేమన్నారు. సీఎంఆర్‌ఎస్ దీనిని లాంఛనంగా ఆమోదించాల్సి ఉందన్నారు.
ఈ నేపథ్యంలో ఈ మార్గంలో సేవలు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని నిర్దిష్టంగా ఇప్పుడే చెప్పలేమన్నారు. కాగా అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల పదో తేదీన భద్రతా కమిషనర్‌తోపాటు వారి సిబ్బంది రోజంతా ఈ మార్గంలో తనిఖీలు నిర్వహించారు. మూడో దశలో భాగంగా మూడు కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గంలో గత ఏడాది డిసెంబర్‌లో సంబంధిత అధికారులు ప్రయోగాత్మక పరుగు కూడా నిర్వహించారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే అత్యంత రద్దీగా ఉండే రాజీవ్‌చౌక్ మెట్రో స్టేషన్‌పై ప్రయాణికుల భారం తగ్గుతుంది. అంతేకాకుండా నోయిడా, వైశాలి దిశగా రాకపోకలు సాగించే ప్రయాణికులు బదర్‌పూర్-సెంట్రల్ సెక్రటేరియట్ లైన్ స్టేషన్‌లో ఇంటర్‌ఛేంజ్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు వీలు కలుగుతుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే 70 వేల మంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని సంబంధిత అధికారులు అంచనా వేశారు.