సాప్ట్ వేర్ నుంచి సమర రంగంలోకి..
ఆర్మీలో చేరుతున్న టెకీలు, ఇంజినీర్లు
చెన్నై: దేశసేవ, సాహసం చేయాలన్న కోరికతో పలువురు సాఫ్ట్‌వేర్, ఇంజనీరింగ్ ఉద్యోగులు సైన్యం వైపు ఆకర్షితులవుతున్నారు. కళ్లు చెదిరే జీతాలు, విలాసాలు అరచేతిలో ఉన్నా వాటిని కాదని, మనసుకు నచ్చిన జవాన్ కొలువుల్లో చేరుతున్నారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న జెంటిల్మెన్ కేడెట్స్, లేడీ కేడెట్స్‌లో పలువురు సాఫ్టవేర్, ఇంజనీరింగ్, జర్నలిజం వంటి రంగాల నుంచి వచ్చిన వారే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో మంచి ఉద్యోగం వదులుకుని ఆర్మీలో చేరినవి.
శరణ్య కమిషన్డ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. ‘ఎన్‌సీసీలో ఉన్నప్పటి నుంచే ఆర్మీలో చేరాలన్న కోరిక ఉండేది. సైన్యం మనోధైర్యాన్ని ఇస్తుంది. నాకు ఏ విధులు ఇచ్చినా పూర్తి చేస్తానన్న నమ్మకం ఉంది’ అని ఆమె చెప్పారు. మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేసిన ఆర్. సతీశ్ కుమార్ కూడా లాభదాయకమైన ఉద్యోగం వదులుకుని సైన్యంలో చేరారు. ప్రముఖ ఇంగ్లిష్ దిన పత్రికలో విలేకర్లుగా పనిచేసిన జాక్స్ జోస్, ప్రశాంత్ విజయ్‌కుమార్ అనే యువకులు కూడా సాహసోపేతమైన విధులు నిర్వహించడానికి ఆర్మీలో చేరామని చెప్పారు. ‘జర్నలిజం కూడా సాహసంతో కూడుకున్నదే. అయితే జవాన్ల విధులు మరింత సాహ సంతో కూడుకుని ఉంటాయి కాబట్టి ఆర్మీలో చేరాను’ అని జోస్ చెప్పారు.