
సిగరెట్ల విడి విక్రయాలపై నిషేధం!
రాజ్యసభలో కేంద్రం ప్రకటన
బహిరంగ ధూమపానంపై జరిమానా 20 వేలుకు పెంపు
పొగాకు ఉత్పత్తులను కొనేవారి కనీస వయసు 25 ఏళ్లకు పెంపు
న్యూఢిల్లీ: సిగరెట్‌ప్రియులకు చేదువార్త. సిగరెట్ క్రయవిక్రయాలను కేంద్రం కట్టుదిట్టం చేయనుంది. సిగరెట్ కావాలంటే ప్యాకెట్ మొత్తం కొనాల్సిందే. ఇకపై సిగరెట్‌ను విడిగా, సింగిల్‌గా కొనుగోలు చేసే అవకాశం ఉండదు. సిగరెట్ల విడి విక్రయంపై నిషేధం విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా మంగళవారం రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం-2003ను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నియమించిన నిపుణుల కమిటీ పలు సిఫారసులు చేసిందని తెలిపారు. వీటిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించిందని పేర్కొన్నారు. ఈ మేరకు కమిటీ నివేదికను కేంద్ర కేబినెట్‌కు సమర్పించినట్లు తెలిపారు. సింగిల్ సిగరెట్లను మైనర్లు కొనుగోలు చేస్తున్నారని, విడి విక్రయాలపై నిషేధం విధించడం ద్వారా దానికి అడ్డుకట్ట వేయాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సదస్సు నిర్దేశించిందని మంత్రి పేర్కొన్నారు.
కమిటీ సిఫారసులు...
* సింగిల్, విడి సిగరెట్ల విక్రయంపై నిషేధం
* బహిరంగ ధూమపానంపై జరిమానా రూ.200 నుంచి రూ.20 వేలకు పెంపు
* పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసే వ్యక్తి కనీస వయసు 18 నుంచి 25 ఏళ్లకు పెంపు
* నిబంధనలు ఉల్లంఘించినవారు శిక్షార్హులు.