public smoking
-
పబ్లిక్ స్మోకింగ్‌కు ఫైన్ వేశారని ఆత్మహత్యాయత్నం!
మైదుకూరు టౌన్ (వైఎస్సార్ జిల్లా): బహిరంగ ధూమపానం (పబ్లిక్ స్మోకింగ్) చట్టరీత్యా నేరం. ఇదేమీ పట్టకుండా ఓ ప్రభుత్వ ఉద్యోగి బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగుతూ పోలీసుల కంట్లో పడ్డాడు. పోలీసులు జరిమానా వసూలు చేయడంతో అవమానంగా భావించి ఆత్మహత్యాయత్నం చేశాడు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని క్రిస్టాపురం గ్రామానికి చెందిన నారమ్మగారి వెంకటసుబ్బయ్య తెలుగుంగ ప్రాజెక్టులో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం స్థానిక బద్వేల్ రోడ్డులోని పొట్టిశ్రీరాములు విగ్రహం సమీపంలో సిగరెట్ తాగుతుండగా మైదుకూరు అర్బన్ సీఐ గమనించారు. పొగతాగడం నేరమని హెచ్చరించి, అందుకు జరిమానా కూడా వేశారు. ఫైన్ ఎందుకు కట్టాలని, తాను ప్రభుత్వ ఉద్యోగినంటూ వాదనకు దిగాడు. అనంతరం జరిమానా కట్టాడు. ఇదంతా అవమానంగా భావించిన వెంకటసుబ్యయ్య కొద్దిసేపటి తర్వాత సమీపంలోని ఫెర్టిలైజర్ దుకాణానికి వెళ్లి పురుగుమందు కొని ఇంటికి వెళ్లే దారిలో తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించి, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప తరలించారు. అక్కడి నుంచి తమిళనాడులోని వేలూరుకు తరలించారు. ఈ విషయంపై సీఐ వెంకటేశ్వర్లును వివరణ కోరగా బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం నేరమని, నిబంధనల ప్రకారం జరిమానా వేసి రశీదు కూడా అందజేశానని తెలిపారు. -
పబ్లిక్ స్మోకింగ్ పై చర్యలేవి?
బహిరంగ ధూమపానాన్ని నిషేధిస్తూ చట్టాలు చేసినప్పటికీ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతున్నదని వాలంటీర్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్(వీఈఓ) ఆవేదన వ్యక్తం చేసింది. బహిరంగధూమపానంపై కఠినంగా వ్యవహించాలని డిమాండ్ చేసింది. ఆదివారం లక్డీకాపూల్‌లోని సంస్థ కార్యాలయంలో ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీఈవో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.వీరభధ్రాచారి, జి. మధుసూధన్‌రెడ్డి దూమపాన నిషేద చట్టం అమలును కోరుతూ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. బహిరంగ ధూమపాన నిషేదిత చట్టం గురించి సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు కానీ ధూమపానాన్ని అరికట్టే చర్యలు తీసుకోవడంలేదన్నారు. ప్రభుత్వం తగిన రీతిలో స్పందించేవరకు సంస్థ తరపున పోరాడుతామన్నారు. -
సిగరెట్ల విడి విక్రయాలపై నిషేధం!
రాజ్యసభలో కేంద్రం ప్రకటన బహిరంగ ధూమపానంపై జరిమానా 20 వేలుకు పెంపు పొగాకు ఉత్పత్తులను కొనేవారి కనీస వయసు 25 ఏళ్లకు పెంపు న్యూఢిల్లీ: సిగరెట్ప్రియులకు చేదువార్త. సిగరెట్ క్రయవిక్రయాలను కేంద్రం కట్టుదిట్టం చేయనుంది. సిగరెట్ కావాలంటే ప్యాకెట్ మొత్తం కొనాల్సిందే. ఇకపై సిగరెట్‌ను విడిగా, సింగిల్‌గా కొనుగోలు చేసే అవకాశం ఉండదు. సిగరెట్ల విడి విక్రయంపై నిషేధం విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా మంగళవారం రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం-2003ను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నియమించిన నిపుణుల కమిటీ పలు సిఫారసులు చేసిందని తెలిపారు. వీటిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించిందని పేర్కొన్నారు. ఈ మేరకు కమిటీ నివేదికను కేంద్ర కేబినెట్‌కు సమర్పించినట్లు తెలిపారు. సింగిల్ సిగరెట్లను మైనర్లు కొనుగోలు చేస్తున్నారని, విడి విక్రయాలపై నిషేధం విధించడం ద్వారా దానికి అడ్డుకట్ట వేయాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సదస్సు నిర్దేశించిందని మంత్రి పేర్కొన్నారు. కమిటీ సిఫారసులు... * సింగిల్, విడి సిగరెట్ల విక్రయంపై నిషేధం * బహిరంగ ధూమపానంపై జరిమానా రూ.200 నుంచి రూ.20 వేలకు పెంపు * పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసే వ్యక్తి కనీస వయసు 18 నుంచి 25 ఏళ్లకు పెంపు * నిబంధనలు ఉల్లంఘించినవారు శిక్షార్హులు. -
పొగరాయుళ్లపై సర్కారు కొరడా!!
పొగరాయుళ్లకు చెక్ పెట్టాలని కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గట్టిగా యోచిస్తోంది. ఇటీవలి బడ్జెట్లోనే సిగరెట్ల ధరలను ఒక మాదిరిగా పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు బహిరంగంగా పొగ తాగడంపైన, లూజుగా సిగరెట్లు కొనడం, అమ్మడంపైన కూడా నిషేధం విధించాలని... వీటిని ఉల్లంఘిస్తే భారీ స్థాయిలో జరిమానాలు వేయాలని కూడా తలపెడుతోంది. ఇది ఐటీసీ లాంటి సిగరెట్ కంపెనీల మీద భారీగానే ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే.. మన దేశంలో చాలా వరకు సిగరెట్ల అమ్మకాలు ఇలా లూజ్‌గానే జరుగుతాయి. ప్యాకెట్లు కొనుక్కుని కాల్చేవాళ్లు తక్కువ. విడిగా రెండు లేదా మూడేసి చొప్పున సిగరెట్లు తీసుకుని ఏపూటకాపూట కాల్చేసేవాళ్ల సంఖ్యే ఎక్కువట. మొత్తం సిగరెట్ల అమ్మకాల్లో 70 శాతం వరకు ఇలాగే జరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సూచనల మేరకే ఈ చర్యలన్నీ తీసుకుంటున్నట్లు సమాచారం. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే కనిష్ఠంగా రూ. 200 నుంచి గరిష్ఠంగా రూ. 20 వేల వరకు కూడా జరిమానా విధించే విషయాన్ని కేంద్రం పరిగణిస్తోంది. అలాగే, సిగరెట్ తాగడానికి కనీస వయసును కూడా పెంచాలని ఆలోచిస్తోంది. ఈ ప్రతిపాదనలన్నింటికీ కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం వచ్చిందంటే మాత్రం.. ఇక పొగరాయుళ్ల పరిస్థితి అంతేనంటున్నారు. అంతేకాదు.. సిగరెట్ ప్యాకెట్ల మీద బొమ్మతో సహా చట్టబద్ధమైన హెచ్చరికలను ముద్రించకపోతే ఇన్నాళ్లూ కేవలం రూ. 5 వేల జరిమానా మాత్రమే విధిస్తుండగా, ఇప్పుడు దాన్ని రూ. 50 వేలకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. అలాగే సిగరెట్లు కాల్చడానికి, కొనడానికి ఇప్పటివరకు కనీస వయోపరిమితి 18 ఏళ్లు ఉండగా దాన్ని 25 ఏళ్లు చేయాలనుకుంటోంది.