
పొగరాయుళ్లపై సర్కారు కొరడా!!
పొగరాయుళ్లకు చెక్ పెట్టాలని కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గట్టిగా యోచిస్తోంది. ఇటీవలి బడ్జెట్లోనే సిగరెట్ల ధరలను ఒక మాదిరిగా పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు బహిరంగంగా పొగ తాగడంపైన, లూజుగా సిగరెట్లు కొనడం, అమ్మడంపైన కూడా నిషేధం విధించాలని... వీటిని ఉల్లంఘిస్తే భారీ స్థాయిలో జరిమానాలు వేయాలని కూడా తలపెడుతోంది. ఇది ఐటీసీ లాంటి సిగరెట్ కంపెనీల మీద భారీగానే ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే.. మన దేశంలో చాలా వరకు సిగరెట్ల అమ్మకాలు ఇలా లూజ్గానే జరుగుతాయి. ప్యాకెట్లు కొనుక్కుని కాల్చేవాళ్లు తక్కువ. విడిగా రెండు లేదా మూడేసి చొప్పున సిగరెట్లు తీసుకుని ఏపూటకాపూట కాల్చేసేవాళ్ల సంఖ్యే ఎక్కువట. మొత్తం సిగరెట్ల అమ్మకాల్లో 70 శాతం వరకు ఇలాగే జరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సూచనల మేరకే ఈ చర్యలన్నీ తీసుకుంటున్నట్లు సమాచారం.
బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే కనిష్ఠంగా రూ. 200 నుంచి గరిష్ఠంగా రూ. 20 వేల వరకు కూడా జరిమానా విధించే విషయాన్ని కేంద్రం పరిగణిస్తోంది. అలాగే, సిగరెట్ తాగడానికి కనీస వయసును కూడా పెంచాలని ఆలోచిస్తోంది. ఈ ప్రతిపాదనలన్నింటికీ కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం వచ్చిందంటే మాత్రం.. ఇక పొగరాయుళ్ల పరిస్థితి అంతేనంటున్నారు.
అంతేకాదు.. సిగరెట్ ప్యాకెట్ల మీద బొమ్మతో సహా చట్టబద్ధమైన హెచ్చరికలను ముద్రించకపోతే ఇన్నాళ్లూ కేవలం రూ. 5 వేల జరిమానా మాత్రమే విధిస్తుండగా, ఇప్పుడు దాన్ని రూ. 50 వేలకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. అలాగే సిగరెట్లు కాల్చడానికి, కొనడానికి ఇప్పటివరకు కనీస వయోపరిమితి 18 ఏళ్లు ఉండగా దాన్ని 25 ఏళ్లు చేయాలనుకుంటోంది.