బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకంపై నిషేధం
త్వరలో ఆదేశాలు జారీ చేస్తామన్న సీఎం
ముంబై: బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వినిమయంపై త్వరలోనే నిషేధం విధిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. పొగాకు, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ల వాడకం వల్ల ఆ ఒక్క వ్యక్తి మాత్రమే రోగాల బారిన పడబోరని, అతని కుటుంబమంతా నష్టపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడి టాటా మెమోరియల్ ఆస్పత్రిని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకంపై త్వరలోనే నిషేధం విధిస్తామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్యాన్సర్ సంభావ్యత 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉందని అన్నారు. అందువల్ల క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా సంస్థల దరిదాపుల్లో పొగాకు, పాన్ మసాలాల అమ్మకాలు బాగా పెరిగినట్టు తెలుస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు.
అందువల్ల హోం శా, విద్యా విభాగం సహకారంతో వాటి అమ్మకాలపై నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పారు. పొగాకు ఉత్పత్తులపై పంజాబ్ ప్రభుత్వం భారీగా పన్నులు విధించిందని అన్నారు. అయితే ఆ పన్నుల వల్ల ఎటువంటి ఫలితాలు వచ్చాయో మాత్రం స్పష్టం కాలేదన్నారు. ఏదైనా మంచి ఫలితం ఉంటే ఆ విధానాన్ని తాము కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని ఫడ్నవీస్ చెప్పారు.