![Salesman Returns Rs 10 Lakh He Found on Road to its Owner - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/19/cash.jpg.webp?itok=cUZvZqni)
సూరత్: రోడ్డుపై పడి ఉన్న బ్యాగులో ఒకటీ రెండూ కాదు.. ఏకంగా రూ.10 లక్షలుంటే ఎవరైనా ఏం చేస్తారు? గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఈ సేల్స్‌మ్యాన్ మాత్రం నిజాయతీగా ఆ డబ్బును సొంతదారుకే ఇచ్చేశాడు. సూరత్‌లోని ఉమ్రా ప్రాంతానికి చెందిన దిలీప్ పొద్దార్ ఓ దుస్తుల దుకాణంలో సేల్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు.శుక్రవారం రాత్రి అతడు ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై ఒక బ్యాగు పడి ఉండటం కనిపించింది. దానిని తెరిచి చూడగా రూ.10 లక్షల విలువైన 2వేల రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే ఆయన తన దుకాణం యజమానికి ఫోన్ చేసి, విషయం తెలిపాడు. ఆయన సలహా మేరకు ఆ డబ్బును తన వద్దనే ఉంచుకున్నాడు. ఆ యజమాని పోలీసులకు ఈ విషయం చేరవేశారు. వివరాలను బట్టి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి, నగదు సొంతదారును గుర్తించి, అతనికి కబురు పంపించారు. స్టేషన్‌కు చేరుకున్న ఆ వ్యక్తి తనపేరు బయటకు వెల్లడించవద్దని చెబుతూ.. పొద్దార్ నిజాయతీకి మెచ్చి రూ.లక్ష అందజేశారు. పొద్దార్‌కు దుకాణం యజమాని హృదయ్ మరో రూ.లక్ష అందజేశాడు. 10 లక్షలను నగలు కొనేందుకు తీసుకువస్తుండగానే పోగొట్టుకున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment