Rs 10 lakh cash
-
సేల్స్‌మ్యాన్ నిజాయతీ!
సూరత్: రోడ్డుపై పడి ఉన్న బ్యాగులో ఒకటీ రెండూ కాదు.. ఏకంగా రూ.10 లక్షలుంటే ఎవరైనా ఏం చేస్తారు? గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఈ సేల్స్‌మ్యాన్ మాత్రం నిజాయతీగా ఆ డబ్బును సొంతదారుకే ఇచ్చేశాడు. సూరత్‌లోని ఉమ్రా ప్రాంతానికి చెందిన దిలీప్ పొద్దార్ ఓ దుస్తుల దుకాణంలో సేల్మ్యాన్గా పనిచేస్తున్నాడు.శుక్రవారం రాత్రి అతడు ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై ఒక బ్యాగు పడి ఉండటం కనిపించింది. దానిని తెరిచి చూడగా రూ.10 లక్షల విలువైన 2వేల రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే ఆయన తన దుకాణం యజమానికి ఫోన్ చేసి, విషయం తెలిపాడు. ఆయన సలహా మేరకు ఆ డబ్బును తన వద్దనే ఉంచుకున్నాడు. ఆ యజమాని పోలీసులకు ఈ విషయం చేరవేశారు. వివరాలను బట్టి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి, నగదు సొంతదారును గుర్తించి, అతనికి కబురు పంపించారు. స్టేషన్‌కు చేరుకున్న ఆ వ్యక్తి తనపేరు బయటకు వెల్లడించవద్దని చెబుతూ.. పొద్దార్ నిజాయతీకి మెచ్చి రూ.లక్ష అందజేశారు. పొద్దార్‌కు దుకాణం యజమాని హృదయ్ మరో రూ.లక్ష అందజేశాడు. 10 లక్షలను నగలు కొనేందుకు తీసుకువస్తుండగానే పోగొట్టుకున్నారని తెలిపారు. -
రూ. 10 లక్షలు దొరికితే... తీసుకెళ్లి...
దొరికిన రూ.10 లక్షలు పోలీసులకు అప్పగింత పోలీస్ కమిషనర్ ప్రశంసలు విజయవాడ : రోడ్డుపై రూ.10 కనిపిస్తే చాలు..అటు ఇటు చూసి చటుక్కున జేబులో వేసుకునే రోజులివి. అలాంటిది అక్షరాలా పది లక్షల రూపాయలు రోడ్డుపై దొరికితే ఇంకేమైనా ఉందా? ఎవరూ చూడకుండా అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించరూ. అలాంటిది తనకు దొరికిన భారీ నగదును నిజాయితీగా పోలీసులకు చేర్చాడో వ్యక్తి. అతని నిజాయితీకి నగర పోలీసు కమిషనర్ ఫిదా అయిపోయి ఘనంగా సత్కరించాలని నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి బుధవారం ఉదయం కుమార్తెను కాలేజీ వద్ద దించి మోటారు సైకిల్‌పై వెళుతున్నాడు. బెంజిసర్కిల్ సమీపంలో రోడ్డు పక్కన పెద్ద సంచి కనిపిం చింది. దానిని తీసుకుని చూస్తే లోపల మరో నల్లని కవర్లో భారీగా నగదు ఉన్నట్టు గుర్తించాడు. తనది కాని సొమ్మును తీసుకెళ్లేందుకు మనస్కరించని సత్యనారాయణ సంచిని తీసుకెళ్లి సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ అధికారికి అప్పగించాడు. ఆపై సత్యనారాయణ, ఇతరుల సమక్షంలో ట్రాఫిక్ అధికారి సంచిలోని నగదు లెక్కించగా రూ.10లక్షలున్నాయి. రూ.500, రూ.1000 నోట్ల డినామినేషన్‌తో కూడిన నోట్ల కట్టలు రోడ్డుపై దొరికిన విషయాన్ని ట్రాఫిక్ అధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆ మొత్తం నగదును అదనపు డీసీపీ(ట్రాఫిక్) టి.వి.నాగరాజు ద్వారా కమిషనరేట్ అధికారులకు అప్పగించారు. సత్యనారాయణ నిజాయితీని గుర్తిం చిన పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ గురువారం స్వయంగా ఆయనను సత్కరించాలని నిర్ణయించారు. ఎవరూ రాలేదు...: దొరికిన నగదుకు సంబంధించి బుధవారం సాయంత్రం వరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని కమిషనరేట్ అధికారులు చెబుతున్నారు. ఆ నగదుకు సంబంధించి కమిషనరేట్‌లోని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఆ నగదు తమదేనంటూ ఎవరూ రాకపోవడాన్ని బట్టి లెక్కల్లో లేని నగదు అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత వ్యక్తులను గుర్తించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు.