రూ. 10 లక్షలు దొరికితే... తీసుకెళ్లి... | cash Rs 10 lakh found at road at benz circle vijayawada city | Sakshi
Sakshi News home page

రూ. 10 లక్షలు దొరికితే... తీసుకెళ్లి...

Published Thu, Dec 3 2015 5:30 PM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

రూ. 10 లక్షలు దొరికితే... తీసుకెళ్లి...

రూ. 10 లక్షలు దొరికితే... తీసుకెళ్లి...

దొరికిన రూ.10 లక్షలు పోలీసులకు అప్పగింత
పోలీస్ కమిషనర్ ప్రశంసలు

 
విజయవాడ : రోడ్డుపై రూ.10 కనిపిస్తే చాలు..అటు ఇటు చూసి చటుక్కున జేబులో వేసుకునే రోజులివి. అలాంటిది అక్షరాలా పది లక్షల రూపాయలు రోడ్డుపై దొరికితే ఇంకేమైనా ఉందా? ఎవరూ చూడకుండా అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించరూ. అలాంటిది తనకు దొరికిన భారీ నగదును నిజాయితీగా పోలీసులకు చేర్చాడో వ్యక్తి. అతని నిజాయితీకి నగర పోలీసు కమిషనర్ ఫిదా అయిపోయి ఘనంగా సత్కరించాలని నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి బుధవారం ఉదయం కుమార్తెను కాలేజీ వద్ద దించి మోటారు సైకిల్‌పై వెళుతున్నాడు.
 
బెంజిసర్కిల్ సమీపంలో రోడ్డు పక్కన పెద్ద సంచి కనిపిం చింది. దానిని తీసుకుని చూస్తే లోపల మరో నల్లని కవర్‌లో భారీగా నగదు ఉన్నట్టు గుర్తించాడు. తనది కాని సొమ్మును తీసుకెళ్లేందుకు మనస్కరించని సత్యనారాయణ సంచిని తీసుకెళ్లి సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ అధికారికి అప్పగించాడు. ఆపై సత్యనారాయణ, ఇతరుల సమక్షంలో ట్రాఫిక్ అధికారి సంచిలోని నగదు లెక్కించగా రూ.10లక్షలున్నాయి. రూ.500, రూ.1000 నోట్ల డినామినేషన్‌తో కూడిన నోట్ల కట్టలు రోడ్డుపై దొరికిన విషయాన్ని ట్రాఫిక్ అధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
 
ఆ మొత్తం నగదును అదనపు డీసీపీ(ట్రాఫిక్) టి.వి.నాగరాజు ద్వారా కమిషనరేట్ అధికారులకు అప్పగించారు. సత్యనారాయణ నిజాయితీని గుర్తిం చిన పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ గురువారం స్వయంగా ఆయనను సత్కరించాలని నిర్ణయించారు.
 
ఎవరూ రాలేదు...: దొరికిన నగదుకు సంబంధించి బుధవారం సాయంత్రం వరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని కమిషనరేట్ అధికారులు చెబుతున్నారు. ఆ నగదుకు సంబంధించి కమిషనరేట్‌లోని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఆ నగదు తమదేనంటూ ఎవరూ రాకపోవడాన్ని బట్టి లెక్కల్లో లేని నగదు అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  సంబంధిత వ్యక్తులను గుర్తించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement